Coal Mines | గోదావరిఖని, జూన్ 20: దేశంలో బొగ్గు గనులతోపాటు ఇతర ఖనిజాలను వేలం ద్వారా అమ్మి సొమ్ము చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తున్నది. శుక్రవారం హైదరాబాద్ వేదికగా దేశంలోని 60 బొగ్గు గనుల వేలానికి సిద్ధం కాగా, ఈ బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేలం పాటకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తున్నది.
ఈ వేలంలో రాష్ట్రంలోని మందమర్రి ఏరియాకు చెందిన శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ బ్లాక్ కూడా ఉన్నది. ఈ ప్రక్రియలో సింగరేణి పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. 119 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న శ్రావణపల్లి బ్లాక్‌లో తక్కువ గ్రేడ్ బొగ్గు లభ్యమవుతుందని, తద్వారా నష్టాలు వచ్చే ముప్పు ఉందని సింగరేణి ఆలోచిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒత్తిడి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే కష్టాలే
రాష్ట్రంలోని బొగ్గు నిల్వలను ఇప్పటివరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే వెలికితీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా కలిగి ఉన్న సింగరేణిలో భూగర్భ గనులు నష్టాల్లో ఉన్నా.. ఉపరితల గనుల్లో వస్తున్న లాభాలను సమం చేస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రైవేట్ రంగం గనులు నిర్వహిస్తే లాభాపేక్షతో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. సింగరేణి సంస్థపైనా దీని ప్రభావం పడుతుందని, ఈ క్రమంలో ఉద్యోగావకాశాలు, ఇతర సౌకర్యాలు కత్తిరించే ప్రయత్నాలు జరుగుతాయని చెబుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలు, ఇతర నోటిఫికేషన్ల ద్వారా 20వేల మంది ఉద్యోగాల్లో చేరారు. వీరంతా 20 నుంచి 30 ఏండ్ల వరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బొగ్గు బ్లాకులు ప్రైవేట్‌కి వెళ్తే వీరి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదమున్నదని, భవిష్యత్తులో కారుణ్య నియామకాలకు బ్రేక్ పడే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేలాన్ని అడ్డుకుంటాం
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు ఏ ఖనిజ నిల్వలను కూడా వేలం వేయకుం డా కాపాడాం. కాంగ్రెస్ సర్కారు సిం గరేణిని వేలంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నది. సింగరేణి యాజమాన్యం కూడా వంతపాడుతున్నది. సింగరేణి లో ప్రైవేటీకరణను అనుమతించబోం.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
ఐక్య పోరాటాలు చేస్తాం
సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేసే ప్రక్రియను ఆపకుం టే ఐక్య పోరాటాలు చేస్తాం. వేలం పాట జరిగినా రద్దు చేసే వరకు పోరాడతాం. జాతీయ కార్మిక సంఘం అయిన హెచ్ఎంఎస్తోపాటు మాతో కలిసి రావడానికి, పోరాటం చేయడానికి ఇఫ్టూ, ఏఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ ముందుకొచ్చాయి.
– రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి