మద్నూర్/ కామారెడ్డి : చంద్రబాబు శక్తుల నుంచి తెలంగాణ ( Telangana ) ను కాపాడు కోవలసిన బాధ్యత బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులపై ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashant Reddy ) అన్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేందుకు కుట్ర ( Conspiracy ) పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
మద్నూర్ మండలం మైథిలి ఫంక్షన్ హాల్లో జరిగిన జుక్కల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు, సర్ (SIR ) ప్రోగ్రాంపై అవగాహన , కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తెలంగాణను అవమానించిన తెలంగాణ ద్రోహి బక్కని నరసింహులని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి , బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఏనాటికైనా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని వెల్లడించారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలే
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలేనని అభివర్ణించారు. 4 వేల ఏళ్ల చరిత్ర కలిగిన త్రిలింగ దేశం మన తెలంగాణ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజిక్కుంచుకుందని విమర్శించారు. ప్రజా సంక్షేమాని విస్మరించి ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల దోపిడీకి రేవంత్ సర్కార్ తెరలేపిందని అన్నారు. జుక్కల్, ఎల్లారెడ్డిలో పండిన జొన్నపంట మొత్తం స్లాబ్ లేకుండా వెంటనే కొనుగోలు చేయకపోతే జుక్కల్ ఎమ్మెల్యే ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడిస్తాయని హెచ్చరించారు.
యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, నేడు ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1,60,000 పైగా ఉద్యోగాలు ఇస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 13,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని బలంగా కోరుకుంటున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.