హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తేతెలంగాణ): కేంద్రం ఉన్నత విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్ ఆరోపించారు. హైదారాబాద్లో ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశం ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దినేష్ మాట్లాడుతూ విద్య కాషాయీకరణ, కార్పొరేటీకరణలో భాగంగానే యూజీసీ 2025 జారీ చేసిన మార్గదర్శకాలు ఉన్నాయని విమర్శించారు.
విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్సెస్ ఎజెండా అమలుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం పదిశాతం కూడా కేటాయించకుండా వివక్ష చూపారని ఆరోపించారు. తక్షణమే యూజీసీ ముసాయిదా 2025 మార్గదర్శకాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎ స్టాలిన్, సంఘమిత్ర జెనా, జాతీయ సహాయ కార్యదర్శులు కే శివారెడ్డి, కబీర్, హమిమ్ హంజా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామక్రిష్ణ, జాతీయ సమితి సభ్యులు గ్యార నరేశ్, బానోత్ రఘురాం, గ్యార క్రాంతి, నాగజ్యోతి, నాసర్ జీ, వలరాజు, సాయికుమార్, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.