గారడి చేస్తుండ్రు.. గడిబిడి చేస్తుండ్రు.. తొండికి దిగితుండ్రు.. మొండికి పోతుండ్రు.. బేమాను నాయకులూ.. భేతాళ మాంత్రికులు.. తెలంగాణను ఆగం చేసేందుకు మనోళ్లతో, మన కంట్లోనే పొడిపించేలా జాతీయ పార్టీలు ఆడే రాజకీయక్రీడలు ఎలా ఉంటాయనేది ఉద్యమ నేతగా కేసీఆర్ దశాబ్దమున్నర కిందటే పాట రూపంలో చెప్పారు.ఇప్పుడదే జరుగుతున్నది.-(గుండాల కృష్ణ)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 20 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని కావేరీ బేసిన్‌కు గోదావరి జలాలను తన్నుకుపోవాలనే మోదీ ప్రభుత్వం వ్యూహం పన్నగా, రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సహకరిస్తూ తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపించేకొద్దీ గోదావరిలో తెలంగాణ గడ్డకు అన్యాయం ముసురుకుంటున్నది. ప్రాంతం, రైతుల భవిష్యత్తు వంటివేవీ పట్టించుకోకుండా కేవలం రాజకీయం, ఓట్లు ప్రాతిపదికన గోదావరిజలాలపై ముగ్గురూ సమిష్టిగా, క్రమబద్ధంగా త్రిముఖ వ్యూహంతో నాటకం ఆడుతూ రక్తి కట్టిస్తున్నారు. ఈ క్రమంలో మేడిగడ్డ బరాజ్‌ను కాలగర్భం లో కలిపేయాలన్న వారిఉమ్మడి లక్ష్యం వేగంగా అమలవుతున్నది. బరాజ్‌పై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విచారణ కొనసాగుతున్న సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ‘నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ’ (ఎన్‌డబ్ల్యూడీఏ) 2024, ఏప్రిల్ 15వ తేదీన వెల్లడించిన ఎజెండాలో మేడిగడ్డ బరాజ్ విఫలమైందని పేర్కొన్నది.
దాని స్థానంలో గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టులో భాగం గా ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించే ప్రతిపాదనను పొందుపరిచింది. వీలైతే ఇచ్చంపల్లి బరా జ్ నుంచి తెలంగాణ నీళ్లు తీసుకోవచ్చని సూ చించింది. అంటే, కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలపాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతుంది. ఈ కుట్రను గుర్తించిన బీఆర్ఎస్ గళం విప్పడంతో రాజకీయంగా దెబ్బతింటామని కాంగ్రెస్, బీజేపీ తెలుసుకొన్నాయి. చంద్రబాబును రంగంలోకి దింపి బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి కొత్త డ్రామాను కొనసాగిస్తున్నాయి. తాజాగా బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం అని హైదరాబాద్‌లో చెప్పిన రేవంత్‌రెడ్డి, ఢిల్లీకి వెళ్లగానే ఇచ్చంపల్లి-కావేరీ లింకుపై చర్చిద్దామని కేంద్రం ముందు మోకరిల్లడమే కుట్రకు సాక్ష్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆరు దశాబ్దాల పాటు కృష్ణాజలాల్లో తీరంగా నష్టపోయిన తెలంగాణ, ఇప్పుడు గోదావరి జలాల్లోనూ చారిత్రక అన్యాయానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. వాస్తవానికి ఈ కుట్ర ఐదేండ్ల కిందటే పురుడు పోసుకోగా, కేసీఆర్ ఉన్నంతవరకు అమలు కానీయలేదని చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించాల్సిందిపోయి, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే లక్ష్యంతో ‘కావేరీ’ వ్యూహంలో పావుగా మారుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందు కు ఏడాదిన్నర కాలంలో జరిగిన నాటకీయ పరిణామాలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.
డ్రామా-1: గోదావరి-కావేరీ అనుసంధానం
తమిళనాడులోని కావేరీ బేసిన్ ఒట్టిపోయింది. గోదావరిజలాలను అక్కడికి తరలించి తమిళ రైతుల్ని ఆకర్షించి ఓట్లు దండుకోవాలనేది బీజేపీ వ్యూహం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదేండ్ల కిందటనే ఈ వ్యూహానికి పదును పెట్టినా కేసీఆర్ హయాంలో ముందుకుపోలేకపోయారు. 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న తెలంగాణ వ్యక్తి ఒకరు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. గోదావరి-కావేరీ అనుసంధానంపై చర్చించారు. ప్రాజెక్టుపై ముందుకుపోయేందుకు పావులు కదిపారు. దీనిని పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ మన నీళ్లను తన్నుకుపోయేందుకు కుట్రలు మొదలయ్యాయని వరుస కథనాలు ప్రచురించింది. బీఆర్ఎస్ సైతం గళం విప్పడంతో ఆ అంశాన్ని పక్కనపెట్టారు.
డ్రామా-2: మేడిగడ్డను పడావు పెట్టే కుట్ర
మేడిగడ్డ-సమ్మక్క బరాజ్‌ల మధ్య ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి అక్కడి నుంచి గోదావరిజలాలను కావేరీకి తరలించేలా కేంద్రం అలైన్మెంట్ రూపొందించింది. ఇది జరగాలంటే సాంకేతికంగా మేడిగడ్డ అడ్డుగా ఉంటుంది. అందుకే దానిని పునరుద్ధరించకుండా ఎన్డీఎస్ఏ, కమిటీలు, కమిషన్లు అంటూ ఏడాదిన్నరగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. 15.4.2024న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌డబ్ల్యూడీఏ 19వ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి ఎజెండా ఖరారు చేసింది. అందులో గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టులో మూడు అంశాలను పేర్కొన్నది. అందులో అత్యంత కీలకమైనది మేడిగడ్డ బరాజ్. ఈ బరాజ్ కుంగిపోయి వైఫల్యం చెందిన నేపథ్యంలో దాని దిగువన ఇచ్చంపల్లి బరాజ్ నిర్మించి కావేరీకి గోదావరిజలాలను తరలించాలని, అవసరమైతే తెలంగాణ అక్కడి నుంచి నీళ్లు వాడుకుంటుందనేది దాని సారాంశం. ఆ సమయంలో మేడిగడ్డ బరాజ్‌పై సాంకేతిక అధ్యయనాలు, విచారణలు కొనసాగుతున్నాయి. విచారణ పూర్తి కాకుండానే బరాజ్ వైఫల్యం చెందిందని, ఇచ్చంపల్లి బరాజ్ నిర్మించాలని ఎందుకు నిర్ణయించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డ్రామా-3:రంగంలోకి చంద్రబాబు
కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. తెలంగాణకు అన్యాయం చేస్తూ తమిళనాడుకు గోదావరిజలాలను ఎలా తన్నుకుపోతారంటూ ప్రశ్నిస్తున్నది. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలను ఇది ఇరకాటంలోకి నెట్టింది. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చారు. దీంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్లాన్ మార్చింది. తెలంగాణను ఎండబెట్టేందుకు చంద్రబాబు ఎప్పుడైనా సిద్ధమనేది తెలంగాణ సమాజానికి దశాబ్దాల అనుభవమే. అందుకే చంద్రబాబు రంగంలోకి దిగారు. పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరిజలాలను కావేరీకి తరలించేలా సహకరిస్తానంటూ కేంద్రానికి హామీ ఇచ్చారు. గోదావరి నీటిని కృష్ణా, పెన్నా బేసిన్లలో వాడుకునేలా బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
డ్రామా-4: బనకచర్ల పేరుతో కుట్రలు
ఇచ్చంపల్లి దగ్గర బరాజ్ అని ముందు చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు బనకచర్లను తెరమీదికి తేవడాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గమనించి అప్రమత్తం కావాలి. కానీ మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ జరగొద్దన్న ఏకైక లక్ష్యంలో భాగంగా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా మౌనం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బనకచర్ల కుట్రను ‘నమస్తే తెలంగాణ’ బట్టబయలు చేస్తూ వరుస కథనాలు ప్రచురించింది. ఇదే సమయంలో తెలంగాణకు జరగబోతున్న చారిత్రక అన్యాయంపై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మౌనం వీడలేదు. మరోవైపు చంద్రబాబు ఏకంగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి బనకచర్ల కుట్ర నిజమేనని కుండబద్దలు కొట్టారు. ఎన్‌డబ్ల్యూడీఏ కూడా భాగస్వామ్య రాష్ర్టాలతో సమావేశానికి హైదరాబాద్ వేదికను ఖరారు చేసి అధికారికంగా లేఖలు పంపింది.
డ్రామా-5: కేంద్రం హామీ ఇచ్చిందని నాటకాలు
బీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టకేలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెర మీదకొచ్చి ‘మేం అప్రమత్తంగానే ఉన్నాం. అసలు ఏపీ డీపీఆర్ సమర్పించలేదట. కేంద్ర మంత్రి నాకు స్వయంగా లేఖ రాశారు. మమ్మల్ని సంప్రదించనిది ముందుకుపోనని మాటిచ్చారు’ అని తీరిగ్గా సెలవిచ్చారు. కానీ కేంద్రంలో బనకచర్ల నిర్మాణానికి పావులు శరవేగంగా ముందుకు కదిలాయి. ఏకంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు అనుమతుల్లో భాగమైన టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని బీఆర్ఎస్ మరింత ఎండగట్టింది. మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బనకచర్ల కుట్రలను, తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రజల ముందుంచారు. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో బదనాం అవుతున్నామని గ్రహించి కొత్త డ్రామా మొదలు పెట్టింది.
డ్రామా-6: అఖిలపక్ష ఎంపీల సమావేశం
బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల్లో తప్ప ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వాలు అఖిలపక్షం నిర్వహించడం అరుదని నిపుణులు చెప్తున్నారు. పైగా ఎక్కడైనా అఖిలపక్ష సమావేశమంటూ రాష్ట్రంలోని పార్టీలకు సమాచారం ఇచ్చి, పలానా అంశంపై పార్టీ నుంచి హాజరుకావాలని కోరుతారు. కానీ బనకచర్లపై మాత్రం ఎంపీల అఖిలపక్షం నిర్వహించడం వెనుక అసలు కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బనకచర్ల ద్వారా కావేరీకి గోదావరిజలాల తరలింపు ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దంటే ‘కర్ర విరగొద్దు-పాము చావొద్దు’ అన్నట్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో ఏపీ చంద్రబాబు మీడియా ముందుకొచ్చి తాను కాళేశ్వరంపై ఏనాడూ ఫిర్యాదు చేయలేదని రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారు. కూర్చుని మాట్లాడుకుందాం… ప్రాజెక్టులు మీరూ కట్టుకోండి! నీళ్లు వాడుకోండి!! అని ఉచిత సలహాలిచ్చారు.
డ్రామా-7:కేంద్రం ముందు మోకరిల్లడం
అఖిలపక్షం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలిసి బనకచర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తే బాగుండేది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. కేవలం సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి వెళ్లి కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణకు చెప్పకుండా బనకచర్లపై ముందుకుపోమని హామీ ఇచ్చి, ఇప్పుడు తమకు తెలియకుండానే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ టీవోఆర్‌ను ఎందుకు ఖరారు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ప్రశ్నించాలి. కానీ అదేమీ జరగలేదు. పైగా బనకచర్ల అంశాన్ని అటకెక్కించి, ఇచ్చంపల్లి దగ్గర బరాజ్ నిర్మించి కావేరీకి నీళ్లు తీసుకుపోయే అంశంపై చర్చిద్దామంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కేంద్రం ముందు మోకరిల్లడమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బనకచర్లను అడ్డుకుంటామని అఖిలపక్ష సమావేశంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన తర్వాత చంద్రబాబుతో కూర్చుని బనకచర్లపై మాట్లాడేందుకు సిద్ధమని మీడియా చిట్‌చాట్‌లో చెప్పడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ భవిష్యత్తు ఏమిటి..?
ఇలా ఏడాదిన్నరగా చోటుచేసుకున్న పరిణామాలతో రాష్ట్ర జలహక్కులపై కత్తి వేలాడుతున్నదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీనిని అడ్డుకొని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యాచరణ ఏమిటనేది అంతుబట్టడంలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించి ప్రాణహితజలాలను వాడుకుంటారా? దిగువన పోలవరానికి వదిలిపెడతారా? అనే దానిపైనా ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరిపై ఏడాదిలో ఎన్ని రోజులు, ఎంత ఇన్‌ఫ్లో ఉంటాయనేది శాస్త్రీయంగా తేలలేదు. అయినా మోదీ ప్రభుత్వం కావేరీకి గోదావరి జలాలను తన్నుకుపోవడం, సందట్లో సడేమియాలా చంద్రబాబు ఏపీలోని కృష్ణా, పెన్నా బేసిన్‌కు గోదావరి జలాలను తరలించుకుపోవడాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమర్ధిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.