‘రాజోలిబండ డైవర్షన్ సీమ్‌కు 15 టీఎంసీల కేటాయింపు ఉన్నా పూడిక పేరుకుపోవడంతో 5 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నం. సమస్యకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ శాశ్వత పరిషారం చూపిస్తారని విశ్వసిస్తున్నం’.. తుంగభద్ర డ్యామ్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాట ఇది! మరి ఇందులో నిజమెంత? అని సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ జలదోపిడీయే ఆర్డీఎస్ దుస్థితికి కారణం కాదా? ఆనికట్ మోడ్రనైజేషన్ పనులు నిలిచిపోవడానికీ ఏపీనే కారణం కాదా?’ అని ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రం, కేంద్రం కుట్రలో రేవంత్ సర్కార్ పావుగా మారిందని, వాస్తవాలను దాచి తెలంగాణ జలహక్కులకు ఉరివేసే ఎగువ రాష్ర్టాల ప్రాజెక్టులకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతులిచ్చి ఇప్పుడు పూడిక పేరిట మరో డైవర్షన్ డ్రామా ఆడుతున్నదని విమర్శిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తుంగభద్రా నది కర్ణాటక (రాయచూర్ జిల్లా)కు, ఆంధ్రప్రదేశ్ (కర్నూలు జిల్లా)కు సరిహద్దుగా 60 కిలోమీటర్ల తర్వాత ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ఆనకట్ట ఉన్నది. ఆనకట్టకు దాదాపు 40 కి.మీ దిగువ నుంచి తుంగభద్ర కృష్ణాలో కలిసే వరకు తెలంగాణ (మహబూబ్‌నగర్ జిల్లా), ఆంధ్రప్రదేశ్ (కర్నూలు జిల్లా) సరిహద్దుగా ఉంటుంది. ఈ మధ్యలో సుంకేసుల బరాజ్ ఉన్నది. సూటిగా చెప్పాలంటే తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ దిగువన సుంకేసుల బరాజ్ ఉన్నది. ఆర్డీఎస్ దిగువన నదిలోకి వెళ్లే జలాలు సుంకేసులకు చేరి అకడి నుంచి కేసీ కెనాల్ ద్వారా కృష్ణా బేసిన్ ఆవల ఉన్న సీమాంధ్ర ఆయకట్టుకు సాగునీరందిస్తుంది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎడమ కాలువ ఆనికట్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో 42.6 కి.మీ మేర, ఆ తర్వాత తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో 103 కి.మీ. ఉంటుంది. ఆర్డీఎస్ కాలువ కింద కర్ణాటకకు 1.2 టీఎంసీలు, తెలంగాణకు 15.9 టీఎంసీల మేర ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి ఏనాడూ తెలంగాణ భూభాగం తన పూర్తి జలాలను వినియోగించుకోలేని దుస్థితి. ఇప్పటికీ తెలంగాణ తన వాటాలో కేవలం 5.5 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్‌ను నిర్మించింది. ఆర్డీఎస్ ఆయకట్టుకు ఊపిరిపోసింది.
పూడిక కాదు.. జలదోపిడీయే ప్రధాన కారణం
ఆర్డీఎస్ కింద తెలంగాణ తన వాటా జలాలను వినియోగించుకోకపోవడానికి ప్రధాన కారణం ఎగువన కర్ణాటక, మరోవైపు ఏపీ ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతూ జలదోపిడీకి పాల్పడటమే. తుంగభద్రా నదిలో ప్రవాహాలు ఎకువగా ఉన్నప్పుడు మాత్రమే అంటే 1,083 అడుగులకు చేరితే గానీ ఆర్డీఎస్ ఎడమ కాలువలోకి నీటిని పంపడం సాధ్యపడదు. కానీ, ఆనికట్ వద్ద ఆ మేరకు నీటిమట్టాన్ని మెయింటైన్ చేసే పరిస్థితే లేకుండా పోయింది. తుంగభద్రా నది ఆర్డీఎస్ వద్ద కుడివైపు కొద్దిగా వాలుగా ప్రవహిస్తుంది. ఆ వైపు స్లూయిస్‌లు తెరిస్తే నీటి ప్రవాహమంతా కుడివైపు నుంచే దిగువకు వెళ్లిపోతుంది. సుంకేసులకు చేరుతుంది. ఎడమ వైపునకు ప్రవాహాలే రావు. అనికట్ తూములన్నింటినీ మూసి ఉంచితేనే నిర్దేశిత నీటిమట్టానికి చేరి, ఎడమ కాలువకు నీరందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేసీ కెనాల్‌కు సాగునీటి కోసం ఆర్డీఎస్ కుడివైపు తూములను గతంలో బాంబులతో పేల్చివేశారు. దాడులకు తెగబడిన ఉదంతాలూ అనేకం. బాంబులతో పేల్చివేసిన తూమును ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగానే మూసివేయలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ దిశగా పనులు చేపట్టనీయకుండా అడ్డుకొంటూ వస్తున్నారు. ఇప్పటికీ తెరిచే ఉన్నది. దానికి కారణం సుంకేసుల బరాజ్‌కు, తద్వారా ఏపీకి నీటిని తరలించే కేసీ కెనాల్‌కు నిరంతరాయంగా నీటి ప్రవహం ఉంచడమే దాని అసలు లక్ష్యం. ఫలితంగా ఎడమవైపు ఆర్డీఎస్ తెలంగాణ ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొన్నది.
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ బీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం
తెలంగాణ ఉద్యమ సమయం నుంచే కాదు.. రాష్ర్టావిర్భావం అనంతరం కూడా ఆర్డీఎస్ రైతాంగం పక్షాన నిలబడింది కేసీఆర్ ఒక్కరే. ప్రత్యేక రాష్ట్రంలో ఆర్డీఎస్ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషిచేశారు. రీ ఇంజినీరింగ్‌లో భాగంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టు పరిరక్షణ కోసం కెనాల్ ఆధునీకరణతో పాటు సుంకేసుల ఆనకట్ట బ్యాక్‌వాటర్ నుంచి తుమ్మిల్ల లిఫ్ట్ సీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు.. అప్పటి కర్ణాటక మంత్రితో చర్చలు జరిపి పనులు ప్రారంభించారు. అంతేకాదు మిగిలిన ఆనికట్ ఆధునీకరణ, కెనాల్ హెడ్‌వర్క్స్ పనుల కోసం కావాల్సిన నిధులను కర్ణాటకకు సమకూర్చింది. మిగిలిన ఆ పనులను కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేయకుండా శాంతిభద్రతల సమస్యల పేరిట ఇప్పటికీ ఏపీ పాలకులు అడ్డుకొంటున్నారు. ఇదే విషయంపై కేంద్రానికి, కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమార్లు లేఖలు రాసింది. కేసీఆర్ సర్కార్ ఒత్తిడితో ఎట్టకేలకు కేఆర్ఎంబీ దిగొచ్చింది. ఆర్డీఎస్‌పై 2022లోనే కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో చర్చించింది. తుంగభద్ర బోర్డు అధికారులనూ అందులో భాగస్వాములను చేసింది. తుదకు ఆర్డీఎస్‌పై సమగ్ర అధ్యయనం చేయించాలని 16వ బోర్డు సమావేశం నిర్ణయించింది.
సీడబ్ల్యూపీఆర్ఎస్కు మార్గదర్శకాలు
సమగ్ర అధ్యయనం కోసం పుణె సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్‌ను (సీడబ్ల్యూపీఆర్ఎస్) కేఆర్ఎంబీ సంప్రదించింది. ఆర్డీఎస్ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువలోకి 850 క్యూసెక్కుల డిశ్చార్జ్ కోసం చేయాల్సిన డిజైన్ మార్పులను గుర్తించడం, డిశ్చార్జ్లోని లోపాలపై ఆనికట్, హెడ్ రెగ్యులేటర్ డిజైన్ ప్రభావాన్ని పరీక్షించడం, ఆర్డీఎస్ ఆనికట్, హెడ్ రెగ్యులేటర్ నుంచి 7:10 నిష్పత్తిలో నీటి విడుదలకు చేపట్టాల్సిన మార్పులు, ఆనికట్ భద్రత, పటిష్ఠానికి తీసుకోవాల్సిన ప్రమాణాలపై, వాడాల్సిన కాంక్రీట్ మిశ్రమాలను సిఫార్సు చేయడం, మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఆనికట్ ఉంటే కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అంశాలపై సూచనలు ఇవ్వడంతోపాటు ఇతరత్రా అంశాలపై అధ్యయనం చేయాలని సీడబ్ల్యూపీఆర్ఎస్కు మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. అందుకు సుముఖతను వ్యక్తం చేయడమేగాక, అధ్యయనానికి రూ.24 లక్షల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసి కేఆర్ఎంబీకి సీడబ్ల్యూపీఆర్ఎస్ అందివ్వడం, దానిపై 17వ బోర్డు సమావేశంలో చర్చించారు. అయితే ఏపీ అడ్డంకులు, అభ్యంతరాలతో తుదకు ఆ ప్రక్రియ అక్కడితోనే నిలిచిపోయింది. దీంతో ఆర్డీఎస్ ఆనికట్ ఆధునీకరణ మళ్లీ మొదటికొచ్చింది.
రేవంత్ సర్కార్ డైవర్షన్
ఆర్డీఎస్ సమస్యలకు మూలకారణాలన్నింటినీ దాచి ఇప్పుడు పూడిక పేరుకుపోవడం, నిర్మాణపరమైన అవరోధాల వల్లే కాలువకు తగినంత నీరు చేరడం లేదని కేంద్రం, పొరుగు రాష్ర్టాలు నమ్మబలుకుతున్నాయి. పూడికతీత, మళ్లీ కొత్తగా ఆధునీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. పొరుగు రాష్ర్టాల వాదనలకూ రేవంత్ సర్కార్ వత్తాసు పలుకుతున్నది. చారిత్రాత్మకమైన చర్చలు, ఒప్పందాలు అంటూ ఊదరగొడుతున్నారు. కానీ వాస్తవంగా డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. పూడిక పేరిట కర్ణాటక రాష్ట్రం తుంగభద్రకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నావలి రిజర్వాయర్‌ను విస్తరించేందుకు, ఆర్డీఎస్ ఎగువన, దిగువన మరికొన్ని బరాజ్‌ల నిర్మాణానికి పూనుకొన్నది. పొరుగున ఏపీ రాష్ట్రం సైతం కేసీ కెనాల్ ఆయకట్టు కోసమంటూ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం ముమ్మర యత్నాలు చేస్తున్నది. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు సాగునీరందించే ‘కొడంగల్-నారాయణపేట లిఫ్ట్’ అనుమతుల కోసం ఎగువ రాష్ర్టాలు చేపడుతున్న ప్రాజెక్టులకు రేవంత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్డీఎస్కు పూర్తిగా ఉరివేసింది. ఆ షరతులతోనే కర్ణాటక ఎన్వోసీ మంజూరు చేసింది. ఈ విషయాలు వెలుగులోకి రాగానే సర్కార్ హడావుడి ప్రారంభించింది. చర్చలంటూ ఊదరగొడుతున్నది. పొరుగు రాష్ర్టాలు, కేంద్రం ఏది చెబితే అందుకు కాంగ్రెస్ సర్కార్ తలాడిస్తూ ప్రస్తుతం తెలంగాణ జలహక్కులను పూర్తిగా పణంగా పెడుతున్నది.
నిపుణుల కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు
ఉద్యమనేతగా కేసీఆర్, ఆర్డీఎస్ రైతాంగం నిలదీతల ఫలితంగా నాడు ఉమ్మడి పాలకులు ఆర్డీఎస్ ఆనికట్ ఆధునికీకరణ అంటూ కొత్త రాగం అందుకొన్నారు. అందుకోసం సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2004లో సమర్పించిన నివేదికలో పలు సిఫార్సులు చేసింది. అందులో ప్రధానంగా ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు ‘1 అడుగు ఎత్తు పెంచాలని, కాలువలను ఆధునికీకరించాలని చెప్పింది. అయినా ఉమ్మడి పాలకులు దానిని 6 అంగుళాల మేర మాత్రమే పెంచాలని నిర్ణయించారు. దాన్ని అయినా అమలు చేశారా? అంటే అదీ లేదు. కేసీ కెనాల్‌కు నీళ్లు అందబోవని ఎత్తు పెంపు, ఆనికట్ మరమ్మతులు, ఆధునికీకరణ పనులను అడ్డుకొన్నారు. ఫలితంగా మొత్తం 820 మీ. ఆనకట్ట పొడవులో కర్ణాటక వైపు 160 మీటర్ల మేరకు మరమ్మతు మాత్రమే చేశారు. కర్నూలు వైపు 2004 నుంచి ఇప్పటికీ ఏ విధమైన పురోగతి లేదు. వెరసి తెలంగాణలో నీటి సమస్య ఎప్పటిలాగే కొనసాగుతున్నది.
కర్ణాటకలో యథేచ్ఛగా నీటి తోడివేత
ఆర్డీఎస్ ఆనికట్ నుంచి ఆరంభమయ్యే ఎడమ కాలువను హెడ్‌వర్క్స్ వద్ద 850 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేశారు. తెలంగాణ సరిహద్దుకు వచ్చేసరికి 770 క్యూసెక్కుల సామర్థ్యానికే కుదించారు. ఈ కాలువ తొలుత కర్ణాటక రాష్ట్రంలో 42 కిలోమీటర్లు మేర ప్రవహించి ఆపై తెలంగాణలోకి ప్రవేశించి 103 కి.మీ. వరకు కొనసాగుతుంది. అంటే కర్ణాటక రాష్ర్టాన్ని దాటుకొని తెలంగాణలోకి జలాలు రావాలి. కానీ కర్ణాటక రాష్ట్రం ఆర్డీఎస్ ఆనికట్ తూముల నుంచే కాక 42 కి.మీ. మేర ఎడమ కాలువపై వందలాది పంపుసెట్ల ద్వారా నీటిని ఎక్కడికక్కడే యథేచ్ఛగా తోడేస్తున్నారు. ఫలితంగా ఎడమ కాలువ తెలంగాణ సరిహద్దు వద్ద కాలువలో 750 క్యూసెకుల నీరు రావాల్సి ఉన్నా, ఏనాడూ 300 క్యూసెకులకు మించి రాని దుస్థితి నెలకొన్నది. ఫలితంగా ఆర్డీఎస్ వాటా నీరు తెలంగాణకు దక్కడమే లేదు.