హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రోడ్లపై గుంతల సమస్య పరిషారానికి ప్రభుత్వం ఒక యాప్‌ను ఏర్పాటు చేయవచ్చు కదా అని హైకోర్టు సూచించింది. జనం ఆ యాప్ ద్వారా తెలియజేసే ఫిర్యాదులను పరిశీలించి పరిషార చర్యలు తీసుకోడానికి సులభం అవుతుందని చెప్పింది. ఈ విధానం కర్ణాటకలో అమల్లో ఉన్నదని తెలిపింది.
రోడ్లపై గుంతల పూడ్చివేతకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రోడ్లపై గుంత ల్లో పడి కొందరు చనిపోయారని, మ్యాన్‌హోల్స్‌లో పడి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని, వాళ్ల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని అడ్వకేట్ కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. వాదనల తర్వాత హైకోర్టు యాప్ ప్రతిపాదన చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.