Mid Manair Dam | కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ ఇండ్లతోపాటు 18 ఏండ్లు నిండిన వారికి పట్టా, పరిహార ప్యాకేజీ ఇప్పిస్తామంటూ శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్య మానేరు) ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు నయా దందాకు తెరలేపారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూర్చొని అధికారులతో సంబంధం లేకుండా నేరుగా తామే దరఖాస్తులు తీసుకోవడంపై విమర్శలొస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) ముంపు గ్రామాల్లోని 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. వీటికి సంబంధించి ఇంకా విధి విధానాలు రావాల్సి ఉన్నది.
ప్రభుత్వ ఉత్తర్వులను ఆసరాగా చేసుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటినుంచే దందా మొదలు పెట్టారు. ఇందిరమ్మ ఇండ్లతోపాటు 18 ఏండ్లు నిండిన వారు పట్టా, పరిహార ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ.. వాట్సాప్ గ్రూప్స్‌లో ప్రచారం చేశారు. ఆదివారం కొదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే కూర్చొని, కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమకు ఏ విధమైన అధికారిక హోదా లేకపోయినప్పటికీ, ప్రజల నుంచి ఇందిరమ్మ ఇండ్లతోపాటు యువతకు పట్టా, పరిహారం ప్యాకేజీ ఇప్పిస్తామంటూ దరఖాస్తులు తీసుకున్నారు. ఈ విషయం గ్రామం మొత్తానికి పాకడంతో చాలామంది తమ పనులన్నీ మానుకొని అక్కడికి తరలి వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. ఇది ప్రభుత్వపరంగా చేపట్టిన అధికారిక కార్యక్రమం కాదు. అధికారులెవ్వరూ పాల్గొనలేదు. కానీ.. కాంగ్రెస్ నాయకులే దరఖాస్తులు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంత అధికార పార్టీ అయినా, ఇందిరమ్మ ఇండ్లు, పట్టా, పరిహారం ప్యాకేజీలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దరఖాస్తులు తీసుకొని.. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పేరుతో దందా నడపడానికే ఇలా స్వీకరించారన్న విమర్శలొస్తున్నాయి.
కొత్త దరఖాస్తుల ప్రక్రియే లేదు
నిజానికి ముంపు గ్రామాలతోపాటు ఇందిరమ్మ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు కేటాయించిన విషయం తెలిసిందే. వీటికి కూడా ప్రస్తుతం దరఖాస్తులు తీసుకోవడం లేదు. గతంలో ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని.. అందులో ఇంటి కోసం ఆర్జీ పెట్టుకున్నవారి జాబితాను ఇప్పటికే అధికారులు నియోజవర్గాలవారీగా తయారుచేశారు. ఆ జాబితా ఆధారంగా అర్హులను గుర్తించే బాధ్యతను.. పంచాయతీ కార్యదర్శలకు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం వినియోగిస్తున్నది. ప్రస్తుతం ఆ ప్రక్రియ సాగుతున్నది. అంతేతప్ప, కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఇదే సమయంలో.. ప్రభుత్వం ముందుగా ఇందిరమ్మ కమిటీలు వేయాలని భావించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సైతం ఇచ్చింది. అయితే, ఇందిరమ్మ కమిటీలను ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేయలేదు. బాధ్యతలు అప్పగించలేదు.
ముంపు గ్రామాల్లో మాయ
ఇందిరమ్మ పథకం కింద మధ్యమానేరు ముంపు గ్రామాల్లోని 4,696 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన జాబితా ప్రకారమే ప్రభుత్వం సదరు లబ్ధిదారుల కుటుంబాలను గుర్తించింది. వీటికి పేమెంట్స్ ఎలా చేస్తారు? దశలవారీగా ఇస్తారా? లేక ఏమైనా మార్పులు చేస్తారా? అనేది తేలాల్సి ఉన్నది. దీంతోపాటు 18 ఏళ్లు నిండిన యువతకు పట్టా, ప్యాకేజీ ఇచ్చే విషయంలో కూడా విధి విధానాలు రావాల్సి ఉన్నది. ఇవేవీ పట్టించుకోకుండా, కొదురుపాక గ్రామ కాంగ్రెస్ నాయకులు.. వంశీ, వెంకటేశం తదితరులు కలిసి ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే దరఖాస్తులు తీసుకోవడంపై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. అధికారిక గ్రామ పంచాయతీ భవనాన్ని కాంగ్రెస్ నాయకులు ఎలా వాడుకుంటారన్న విమర్శలొస్తున్నాయి. అదివారం పంచాయతీ కార్యాలయం దాదాపుగా మూసి వేసి ఉంటుంది. కానీ, నాయకులు మాత్రం పంచాయతీ కార్యాలయంలోనే దరఖాస్తులు తీసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.