Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను అప్పుల్లో ముంచిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారమంతా బూటకమేనని తేలింది. గత డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల కరపత్రమని తేటతెల్లమైంది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్పాలనలో తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లకు చేరాయన్న రేవంత్ ప్రభుత్వ ప్రకటన వాస్తవదూరమని రుజువైంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్-2024 పేరిట సోమవారం విడుదల చేసిన గణాంకాల ద్వారా అర్థమవుతున్నది.
2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ. 72,658 కోట్లుగా ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ. 3,89,673 కోట్లకు చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. గ్యారెంటీల ద్వారా ప్రభుత్వరంగ సంస్థల నుంచి తీసుకొన్న రుణాలు మరో రూ. 38,867 కోట్లని నివేదిక వివరించింది. దీంతో బీఆర్ఎస్హయాంలో తెలంగాణ రుణాలపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనన్న విషయం రుజువైందని తెలంగాణవాదులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి విషప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు.