హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నూతన స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక లాంఛనమే. గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా గురువారం ప్రకటించనున్నారు. అనంతరం గడ్డం చేత ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీంతో స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుంది. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు యశోద దవాఖానలో కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్‌ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు బుధవారం పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గడ్డం ప్రసాద్‌కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ప్రాం గణంలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిసి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
నాలుగు సెట్ల నామినేషన్లు
శాసనసభ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులుకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బీ లక్ష్మారెడ్డి, కాలేరు యాదయ్య, కూనంనేని సాంబశివరావు, మందల సామ్యేల్, మక్కన్‌సింగ్ ఠాకూర్‌సింగ్, మాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్‌కుమార్ పేరును ప్రతిపాదిస్తూ కేటీఆర్ సంతకం చేశారు.
గడ్డం ప్రసాద్‌కు 110 మంది ఎమ్మెల్యేల మద్దతు
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ అభ్యర్థిత్వానికి బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్ సభ్యులు, 39 మంది బీఆర్ఎస్ సభ్యులు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్టయ్యింది.
నేడు ఉదయం 10.30 సమావేశాలు ప్రారంభం
స్పీకర్ ఎన్నిక కోసం గురువారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానున్నది. ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అనంతరం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేత ప్రొటెంస్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగించే విషయాన్ని స్పీకర్ ప్రకటించనున్నారు. ఆ తరువాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని శాసనసభ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
పాత్రికేయుల నిరసన
స్పీకర్ నామినేషన్ దాఖలు సందర్భంగా తమను లోనికి అనుమతించలేదని జర్నలిస్టులు నిరసన వ్యక్తంచేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా మీడియాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరికి అనుమతించరనే విషయం తమకు తెలుసునని, అయితే ఒక మీడియా (వీ6 టీవీ) ప్రతినిధిని అనుమతించి తమను విస్మరించడం ఏమిటని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. సభా నిర్వహణ, ఎన్నికల నిర్వహణలో పక్షపాతం వహించకుండా పారదర్శకతను పాటించాలని, ఒక మీడియా సంస్థను అనుమతించి, తక్కిన సంస్థలను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు.
అసెంబ్లీలో మూడంచెల భద్రత
రాష్ట్ర శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత కల్పించాలని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని సూచించారు. లోక్‌సభలోకి అగంతకులు చొరబడిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం వారు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ఆగంతకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున లోక్‌సభ తరహా ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రత చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జారీ అయిన పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.