Jagga Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తేతెలంగాణ): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకొని ప్రశ్నించిన వారే.. అధికారంలోకి రాగానే మౌనం వహించడం లేదా మాటమార్చడం ప్రజలను మోసం చేయడమే అవుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఒకే మాటపై ఉండాలని చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గురువారం సోషల్ మీడియా వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచిందని, అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హామీని నాడు మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో పోరాడి అనేక డిమాండ్లు చేయడం, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేయడం సరైన పద్ధతికాదని హితవు పలికారు. హామీలపై అధికారపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం విశ్వసనీయత అని, కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గతంలో ఆ పార్టీలు ఇచ్చి న హామీలను విస్మరించవద్దని తేల్చిచెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శించవద్దని సూచించారు.