Indiramma Indlu | హైదరాబాద్, జనవరి18(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 2.18 లక్షల దరఖాస్తులు రాగా, ఇండ్లు 3,500 మాత్రమే కేటాయించడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికలో ఫీల్డుసర్వే, గ్రామ సభల నివేదికలే కీలకమని చెప్తున్న ప్రభుత్వం, అంతిమంగా స్థానిక ఎమ్మెల్యేల ఆమోదం లేకుండా ఫైనల్ లిస్టును బయటపెట్టవద్దని జిల్లా ఇన్చార్జి మంత్రులకు, కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి అనుగుణంగానే రెవెన్యూ, పంచాయితీరాజ్, గృహనిర్మాణ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇటీవల అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో కార్యకర్తలతో మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి న తరువాతే మిగిలిన వారికి ఇస్తామని చెప్పడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కలిపి ఇందిరమ్మ ఇండ్ల కోసం 69,83,895 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గానికి సగటున 2.18 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మాత్రమే మంజూరు చేస్తున్నది. ఈ ఇండ్లలో కూడా గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులకు స్పష్టతలేదు. గ్రామాలు, పట్టణాలవారీగా మంజూరుచేసిన ఇండ్ల వివరాలను అధికారులు జిల్లా ఇన్చార్జి మంత్రికి సమర్పిస్తారు.
వాటికి ఇన్చార్జి మంత్రి ఆమోదం తెలుపిన తర్వాతే.. ఏ గ్రామానికి, ఏ పట్టణానికి ఎన్ని ఇండ్లు ఇస్తారో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. దీంతో అధికారులు రాజకీయ జోక్యాన్ని ఆశ్రయించినట్టు ప్రచారం జరుగుతున్నది. స్థానిక ఎమ్మెల్యే ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గానికి సగటున 110 గ్రామాలు ఉన్నాయనుకుంటే, గ్రామానికి 32 ఇండ్లను మించి వచ్చే అవకాశం లేదు. ఈ 32 ఇండ్లను ఎవరికి ఇస్తారనే దానిపైనే చర్చ నడుస్తున్నది. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు ప్రధానపాత్ర పోషించనున్నాయని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీకే పేరు మార్చి ఇందిరమ్మ ఇండ్ల కమిటీగా కలెక్టర్ కార్యాలయాలకు పంపించారు. కలెక్టర్లు ఈ జాబితాను ఆమోదించినట్టు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టాయి.
ప్రజాపాలనలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. 32 జిల్లాల్లో కలిపి దాదాపు 69.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 16 నుంచి ఫీల్డ్ సర్వేయర్లు గ్రామాల్లో తిరిగి, ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను నమోదుచేస్తున్నారు. దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వేతో సరి పోల్చుతున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 వరకు కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 20వ తేదీలోగా అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు.
ఈ నెల 21 నుంచి 22 వరకు నిర్వహించే గ్రామసభల్లో ఈ జాబితాలను ప్రదర్శించి లబ్ధిదారులను ఎంపికచేస్తారు. గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక అనంతరం 23,24 తేదీలను అభ్యంతరాల స్వీకరణ పేరుతో రిజర్వ్ చేసి పెట్టారు. ఇక్కడే రాజకీయం చొరబడుతుందని, గ్రామసభల్లో ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితా కాపీని అనధికారికంగా స్థానిక ఎమ్మెల్యేలకు అందజేస్తారని, ఆయన చేసిన మార్పులు చేర్పులతోనే తుది జాబితా సిద్ధంచేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యేలు ఓకే చెప్పిన తరువాతనే లబ్ధిదారుల జాబితాను కలెక్టరేట్‌కు పంపించాలని, దానిని మాత్రమే తుది జాబితాగా 26వ తేదీలోపు ప్రకటించాలని ముఖ్యనేత నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు విశ్వసనీయంగా తెలిసింది.