Konda Surekha | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అనుచరులు బరితెగించారు. మంత్రిపై సోషల్‌మీడియాలో పెట్టిన అనుచిత పోస్టును బీఆర్ఎస్కు ఆపాదిస్తూ తెలంగాణ భవన్‌పై దాడికియత్నించారు. సోమవారం ఆరుగురు వ్యక్తులు నిరసన పేరిట బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట హంగామా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. షెడ్యూల్ ప్రకారం కేటీఆర్ ప్రెస్‌మీట్ ఉండడంతో అప్పటికే అక్కడికి భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు వేరేచోట నిరసన తెలుపుకోవచ్చు కదా? ఇక్కెడికెందుకు వచ్చారు? అని వారించే ప్రయత్నం చేశారు. మరింత రెచ్చిపోయిన మంత్రి సురేఖ అనుచరులు ఆఫీసులోనికి దూసుకెళ్లేందుకు మెయిన్ గేటు వద్దకు వచ్చారు. బూతులు తిడుతూ బీఆర్ఎస్ నాయకులపై దాడికి యత్నించారు. అప్పటివరకు సంయమనం పాటించిన బీఆర్ఎస్ నాయకులు మంత్రి అనుచరులను అడ్డగించారు. పార్టీ ఆఫీసుపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా బీఆర్ఎస్ ఆఫీసు వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
మంత్రి కొండా సురేఖ ఇటీవల మెదక్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు కలిశారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మూడు రంగులు గల నూలుతో తయారు చేసిన మాలను మంత్రి మెడలో వేశారు. ఈ ఫొటోను ట్యాగ్ చేస్తూ కొందరు యువకులు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. బీఆర్ఎస్కు చెందిన వారే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆక్షేపించారు. సోమవారం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
మంత్రి కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒకరూ సహించరని సోమవారం ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా తానైనా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలకేం పని. కాంగ్రెస్ నేతలు దిష్టిబొమ్మతో భవన్‌కు రావడం ఏమిటి? సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ.. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొకుతున్నారు. యథారాజా తధా ప్రజా అన్నట్టు రేవంత్‌లాగే కాంగ్రెస్ కార్యకర్తలు అసభ్య భాషవాడుతున్నారు.
– బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్