Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష నేతలపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతలు పడకేసిన పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
కాంగ్రెస్ దాడులు ఇవీ..
సెప్టెంబర్ 3: ఖమ్మంలో వరదబాధితులకు అండగా నిలిచేందుకు మాజీమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో వెళ్లిన మాజీమంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకాంద, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు వాహనం ధ్వంసమైంది.
ఆగస్టు 17: మాజీ మంత్రి హరీశ్‌రావు అధికారిక నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీని చించేశారు.
ఆగస్టు 7: తుమ్మిళ్ల లిఫ్ట్ మోటర్‌ను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేయగానే కొద్దిసేపటికే మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మోటర్‌ను బంద్‌చేసి వాగ్వాదానికి దిగారు. వారించిన ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.
జూలై 20: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోరాలోని కప్పలవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ప్రశ్నించిన బీఆర్ఎస్ యువజన విభాగానికి చెందిన కర్నే మహేందర్, అనిల్, నరేశ్‌పై కాంగ్రెస్ శ్రేణులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
జూలై 1: నిరుద్యోగ యువకుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాకేశ్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
జూలై 1: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ వాణీవీరారెడ్డిపై దాడికి పాల్పడ్డారు.
జూన్ 5: నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఉడుతల అంజ య్య కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశా.
జూన్ 2: మంచిర్యాలలో బీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి గడప రాకేశ్‌పై కాంగ్రెస్‌కు చెందిన 15 మంది ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు.
మే 14: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడికి పాల్పడ్డారు.
మే 23: బీఆర్ఎస్ కార్యకర్త బొడ్డు శ్రీధర్‌రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు పదునైన ఆయుధాలతో దాడిచేసి హతమార్చారు. భూ వివాదం నెపంతో మంత్రి జూపల్లి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
మే 25: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు గజవాడ నాగరాజుపై భూ వివాదం నెపంతో కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేశ్.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు.
ఏప్రిల్ 9: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కొమ్మినేపల్లి గ్రామ అధ్యక్షుడు చల్లా హరి కుటుంబంపై దాడి చేశారు. హరి కుమారుడు జానీకి తీవ్ర గాయాలయ్యాయి.
ఏప్రిల్ 21: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సింగార్బొగుడ తండాలో సీసీ రోడ్డు పనులను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనునాయక్‌ను పంచాయతీ పేరుతో పిలిచి కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేయటంతో ఆయన మరణించారు.
ఏప్రిల్ 10: నాగర్‌కర్నూల్ జిల్లా జొన్నలబొగుడలో మాజీ సర్పంచ్ ఇందిర, ఆమె భర్త రవినాయక్‌పై మంత్రి జూపల్లి అనుచరులు దాడికి పాల్పడ్డారు.
మార్చి 19: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే అక్కసుతో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సల్వాజీ మాధవరావుపై కాం గ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు.
ఫిబ్రవరి 20: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లె 3వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ భూకబ్జాలపై ఫిర్యాదు చేసినందుకు పలువురు యువకులపై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
ఫిబ్రవరి 13: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చలో నల్లగొండ పేరుతో నిర్వహించిన బహిరంగసభను అడ్డుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించటంతో హైదరాబాద్ నుంచి సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సుపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి యత్నించారు.
జనవరి 29: యాదాద్రి-భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వేదిక మీది నుంచి పోలీసులతో నెట్టివేయించారు.
జనవరి 8: బీఆర్ఎస్లో చురుగ్గా పాల్గొంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారన్న అక్కసుతో భూవివాదం నెపం మోపి ఆర్మీ మాజీ అధికారి మల్లేశ్‌ను దారుణంగా హతమార్చారని ఆయన భార్య, తల్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు.