చివ్వెంల, ఫిబ్రవరి 13 : ఎస్సారెస్సీ కాల్వల ద్వారా గోదావరి జలాలు అందకపోవడంతో ఎండిన పంటను చూసి కలత చెందిన రైతు అదే పొలంలో ఆత్మహత్యకు యత్నంచాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రం పరిధిలోని కుడుకుడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వేములకొండ లక్ష్మయ్యకు 12 ఎకరాల భూమి ఉన్నది. అందులో వరి నాటు పెట్టగా, సాగు నీరు లేక సగానికిపైగా ఎండిపోయింది. ఇటీవల మూడు బోర్లు వేసినా, ఒక్కదాంట్లోనూ నీళ్లు పడలేదు. పంటకు ఇప్పటికే రూ.2 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టాడు.
ఎస్సారెస్పీ పెద్ద కాల్వ నుంచి పొలంలోకి వచ్చే పిల్ల కాల్వ పూడికకకు మరో రూ.20 వేలు ఖర్చు చేశాడు. అయినా పంటను కాపాడుకునే పరిస్థితి లేకపోవడంతో గురువారం ఉదయం పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, పక్క పొలం రైతులు గమనించి ఆపారు. లక్ష్మయ్యను అక్కడిని నుంచి ఇంటికి తరలించారు. గతంలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు పుష్కలంగా అందేవని, ఇప్పుడు పంటలు ఆగమవుతున్నాయని లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.