హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, ప్రస్తుతమున్న 64 సీట్లు కూడా కాంగ్రెస్‌కు దకవని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ మాటలతో మోసపోయిన ప్రజలు కాంగ్రెస్‌ను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేస్తారని హెచ్చరించారు. నకిరేకల్ వేదికగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, పరిపాలనా వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.
మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అభూతకల్పనలతో కాలం వెళ్లదీస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ జెండాను ఎవరూ తుడిచేయలేరని అన్నారు. మహిళలకు హామీలు అమలు చేయకుండా బయట మాత్రం మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను విమర్శిస్తూ రేవంత్‌రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శించారు.