సిద్దిపేట : మున్సిపల్ ఎన్నికల్లో ( Municipal Elections ) అధికార పార్టీ పలు దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yada) అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులు మీద పుట్టి అన్ని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అధికారం నడిపిస్తుందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గుడ్డిలో మెల్లలాగా కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పోరాటం చేసి గెలుపొందారని కొనియాడారు.
రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎపుడు కూడా శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి సరైన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎక్కడ ఒక్క ప్రాజెక్ట్ నిర్మించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ టికెట్ పెట్టి పురుషులకు డబుల్ రెట్లు పెంచారని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు చూశారని, రాష్ట్రం సాధించడం ఒక్క అద్భుతమైన ఘట్టమని, తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని అనేక ప్రాజెక్ట్ లు నిర్మించారని తెలిపారు. గతంలో నీరు, విద్యుత్ లేక రైతులు ఇబ్బంది పడ్డారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పంట సహాయం చేశారని గుర్తు చేశారు.
తాను టీడీపీ లో ఉన్నపుడు 5గంటలకు మించి విద్యుత్ రాకపోయేదని వివరించారు. రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదేలయింది ని, కేసీఆర్ హయాంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటితే కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయని అన్నారు. సిద్దిపేటను హరీష్ రావు బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు.