సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట పీసీసీ చీఫ్ అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ఫుల్ లీడర్. కానీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. ముఖ్యనేత అనుకూల మీడియాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలిసింది. టీపీసీసీ చీఫ్‌ను, ఆయనకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ నేతలను బెదిరిస్తూ సదరు టీవీ చానల్ పెట్టిన నోట్ క్లిప్పింగ్స్, వార్తా కథనాలను ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీ నటరాజన్.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత రాహుల్ గాంధీకి వాట్సాప్ ద్వారా నివేదించినట్టు సమాచారం.
ఇద్దరు నేతల పంచాయితీని తీవ్రంగా పరిగణించిన రాహుల్‌గాంధీ.. వెంటనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కాల్ చేసి ‘తెలంగాణలో మనం సర్కార్ నడుపుతున్నామా? సర్కస్ నడుపుతున్నామా? తమాషాలు చేస్తున్నారా? ఇట్లా నరుక్కుంటూ పోతే పార్టీలో ఒక్కరూ కూడా మిగులరు. తెలంగాణలో జరుగుతున్న వ్యవహారంలో జోక్యం చేసుకోండి’ అని ఆదేశించినట్టు సమాచారం. ఇలా పార్టీ వ్యతిరేక పనులను ఎవరు ప్రోత్సహించినా సహించేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నచోట పీసీసీ చీఫ్ అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ఫుల్ లీడర్. కానీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. ఓ టీవీ చానల్ పీసీసీ అధ్యక్షుడి మీద అడ్డగోలుగా కథనాలు ప్రసారం చేస్తున్నది. అసలు బండారం బయటపెడుతామంటూ ఒక నోట్ పోస్ట్ చేసి బెదిరిస్తున్నది. సొంత పార్టీ అధినేత మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పైగా ఆ టీవీ చానల్ టార్గెట్ చేసింది బీసీ బిడ్డను. అయినా.. ప్రభుత్వ అధినేత ఇప్పటివరకు నోరు తెరువలేదు. ఎవరూ ఆ చానల్‌ను పల్లెత్తు మాట అనడం లేదు. నోటీసులు ఇవ్వలేదు. చట్టపరమైన చర్యలేవీ తీసుకోవటం లేదు. ఎందుకు ఇలా? ఏం జరుగుతున్నది? ప్రతిపక్షాలే కాదు.. సాధారణ వ్యక్తులు విశ్లేషణలు చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు వేసినా, వాటిని ఫార్వర్డ్ చేసినా ఉలిక్కిపడి కేసులు పెడుతున్న పాలకులు.. ఆ చానల్ మీద మాత్రం ఎందుకు చర్యలకు ఉపక్రమించటం లేదు? ఏకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నారు?ముఖ్యనేత అనుకూల మీడియాలో టీపీసీసీ అధ్యక్షుడిపై జరుగుతున్న దుష్ప్రచారంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలిసింది.
మహేశ్‌కుమార్‌గౌడ్‌ను, ఆయనకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ నేతలను బెదిరిస్తూ సదరు టీవీ చానల్ పెట్టిన నోట్ క్లిప్పింగ్స్, వార్తా కథనాలను ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీ నటరాజన్.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అధినేత రాహుల్ గాంధీకి వాట్సాప్ ద్వారా నివేదించినట్టు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన రాహుల్‌గాంధీ.. వెంటనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కాల్ చేసి తెలంగాణలో మనం సర్కార్ నడుపుతున్నామా? సర్కస్ నడుపుతున్నామా? అని నిలదీసినట్టు తెలిసింది. తమాషాలు చేస్తున్నారా? ఇట్లా నరుక్కుంటూ పోతే పార్టీలో ఒక్కరు కూడా మిగలరని, తెలంగాణలో జరుగుతున్న వ్యవహారం జోక్యం చేసుకోవాలని ఆయన్ను ఆదేశించినట్టు తెలిసింది. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్‌కాల్ లైన్లోకి వచ్చిన కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎపిసోడ్‌పై ఆరా తీసినట్టు తెలిసింది. ఇటువంటి పార్టీ వ్యతిరేక పనులను ఎవరు ప్రోత్సహించినా సహించేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. తక్షణమే సమస్యను పరిష్కరించి, ఢిల్లీకి నివేదించాలని సీరియస్‌గా చెప్పినట్టు తెలిసింది. ఢిల్లీ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌తో మాట్లాడినట్టు తెలిసింది. టీవీ కథనాల గురించి పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి ఆయనకు సూచించినట్టు సమాచారం.
-వర్దెల్లి వెంకటేశ్వర్లు
హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ముఖ్యనేత క్యాంపునకు కొరకరాని కొయ్యగా మారారా? ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీ నటరాజన్‌తో జత కట్టి ఇంటిగుట్టు బయట పెడుతున్నారని ముఖ్యనేత క్యాంపు బలంగా నమ్ముతున్నదా? ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో నిరుపేదల ఇండ్ల కూల్చివేతలు, బండి భగీరథపై పోక్సో కేసులో ముఖ్యనేత తాత్సారం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తున్నదని టీపీసీసీ చీఫ్ ఢిల్లీకి నివేదించారని అనుమానిస్తున్నారా? బిగ్ బ్రదర్స్ చీకటి భూదందాలను, ముఖ్యనేత రౌడీ రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు ఢిల్లీకి సమాచారం చేరవేస్తున్నారని ముఖ్యనేత సన్నిహిత వర్గం నిర్ధారణకు వచ్చిందా? కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం చేయాలనే ఎజెండాకు పీసీసీ చీఫ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని ముఖ్యనేత సన్నిహిత వర్గానికి ఉప్పందిందా? అందుకే ఆయన టార్గెట్ అయ్యారా? ఆయన మెడలు వంచి దారిలోకి తెచ్చుకొనేందుకే ముఖ్యనేత క్యాంప్ ప్రత్యేక కథనాలు వండి వారుస్తున్నదా? రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసే విషయాలు బయటపెడతామనే బెదిరింపులు కూడా ఇందులో భాగమేనా? రాష్ట్రంలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి రాజకీయ వర్గాలు ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం ఇస్తున్నాయి.
ముఖ్యనేత సన్నిహిత మీడియాగా ముద్రపడిన ఒక టీవీ చానల్ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ‘డిజాస్టర్ ప్రెసిండెంట్, ఏఐసీసీ విశ్వాసం కోల్పోయిన అధ్యక్షుడు, క్యాడర్‌ను కన్నెత్తిచూడని పీఠాధిపతి, అధ్వానంగా గాంధీభవన్. సారు కోసం ఇంద్రభవనం’ ఇలా వరుస కథనాలు ప్రసారం చేస్తున్నది. ఇవి రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఆ మీడియా సంస్థ పుట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌కు, ఆ తర్వాత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కథనాన్ని కూడా ప్రసారం చేయలేదనేది బహిరంగ రహస్యం. కానీ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ మీద వరుసగా వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నది. అంతటితో ఆగకుండా మహేశ్‌కు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ నేతలను బెదిరిస్తూ.. మే 25న అంతకంటే పెద్ద విషయం ఇంకా ఏదో ఉన్నదని సూచిస్తూ ఒక కొత్త పోస్ట్ పెట్టింది. ‘ఈ కథ ఇంకా ముగియలేదు. మీరు అడిగారు కాబట్టే మేము వెనకి తగ్గాం. దాన్ని మా చేతగానితనంగా భావించవద్దు. ఆయన కోసం బట్టలు చించుకుంటే మీ బండారమే బయటపడుతుంది. ఈరోజు ఆయనకు అండగా నిలుస్తున్నవారు రేపు వెనుదిరుగుతారు. తెలంగాణ రాజకీయాలను సమూలంగా కుదిపేసే ఒక సంచలన ప్రకటన త్వరలో రాబోతుంది’ అంటూ ఒక నోట్ విడుదల చేసి బెదిరించే ప్రయత్నం జరిగింది. ఇదేదో సాధారణ టీవీ చానల్ అయితే ఏమో! అనుకోవచ్చు. కానీ స్వయంగా ముఖ్యనేత కనుసన్నల్లో నడిచే టీవీ చానల్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన సన్నిహితుడు నడిపిస్తున్న సంస్థ కావడంతో ప్రస్తుత పరిణామాలు దేశవ్యాప్తంగా రాజకీయ పరిశీలకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తమ పార్టీకి అనుకూల చానల్లోనే, పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ఈ వరుస కథనాలేమిటి? పీసీసీ అధ్యక్షుడిని టార్గెట్ చేయడం వెనుక ఎవరున్నారు? అసలు టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉన్నదని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతున్నది.
ముఖ్యనేత ఏరికోరి తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్‌ను టీపీసీసీ పీఠం మీదికి తీసుకొచ్చారని కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నాయి. ఈ పదవి కోసం గౌడ సామాజికవర్గం నుంచే మరో నాయకుడు తీవ్రంగా ప్రయత్నం చేసినా, అధిష్ఠానం ముఖ్యనేత మాటకే విలువ ఇచ్చి మహేశ్‌గౌడ్‌కు ఓటు వేసింది. ఆయన బాధ్యతలు చేపట్టి 20నెలలు దాటింది. ప్రభుత్వంతో సరిజోడిగా ఆయన పార్టీని నడిపిస్తున్నారనే గుర్తింపు ఉన్నది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. సర్పంచ్ ఎన్నికల్లో పర్వాలేదు అనే స్థాయిలోనే సీట్లు గెలిపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ పార్టీని గెలిపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి విజయాన్నే స్కోర్ చేశారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా ఆయన్ను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేయటం వెనుక ముఖ్యనేత కా్ంయపు రాజకీయ కుట్ర ఉన్నదని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. మొదట్లో మహేశ్‌కుమార్‌గౌడ్ ముఖ్యనేత కనుసన్నల్లోనే మెదిలినా, క్రమక్రమంగా వారిద్దరి మధ్య దూరం పెరిగినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇద్దరికీ పొసగడం లేదంటున్నాయి. మంచిరేవుల లోని వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన 114ఎకరాల భూ వివాదంలోకి తన బంధువులను లాగడం, ముఖ్యనేత వర్గం ఏకం గా తననే పిలిచి వార్నింగ్ ఇవ్వడాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్ జీర్ణించుకోలేకపోయారని ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ భూ కుంభకోణాన్ని ఏఐసీసీ వ్యవహరాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఇద్దరు కలిసి పూర్తి వివరాలతో అధిష్ఠానానికి నివేదిక పంపారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే ముఖ్యనేతకు వ్యతిరేకంగా పంపిన తొలి నివేదికగా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి.
క్రమంగా మహేశ్‌కుమార్‌గౌడ్ ముఖ్యనేత నుంచి వేరుపడి ఢిల్లీ దూతతో జట్టుకట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిను ప్రభావితం చేస్తూ.. చకచకా జరిగిపోయిన ఘటనలు వారి మధ్య మరింత దూరం పెంచినట్టు కార్యకర్తలు చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఏండ్ల కిందట పేదలు నిర్మించుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేయడంపై మహేశ్‌కుమార్ ఘాటుగా స్పందించినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీకి నివేదిక పంపినట్టు సమాచారం. ఇటీవల కాలంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ బహిరంగ వేదిక మీద ‘మేరె సే జోడో’ అని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. దీన్ని బహిరంగంగానే ఖండించాల్సిన నేత ఖండిచకపోగా.. సమర్థింపుగా మాట్లాడటం, అదే సమయంలో కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన కేసులో ముఖ్యనేత తాత్సారం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అటు మోదీ ఆఫర్.. ఇటు బండి ఇష్యూ.. ఈ రెండు కూడా తెలంగాణలో పార్టీకి తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ అధిష్ఠానానికి నివేదిక పంపినట్టు తెలిసింది. ఈ నివేదికతో అధిష్ఠానం రాష్ట్ర ముఖ్యనేతను అనుమానించే వరకు వచ్చిందని, పరిస్థితి చేయిదాటిపోవటంతో ముఖ్యనేత బాధిత బాలికకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, బండి భగీరథ్‌ను అరెస్ట చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర వ్యవహారాలు తనకు తెలియకుండా నేరుగా ఢిల్లీకి సమాచారం ఇస్తున్నాడనే ముఖ్యనేత సన్నిహిత మీడియా టీపీసీసీ అధ్యక్షున్ని టార్గెట్ చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మరో మంత్రివర్గ ప్రక్షాళన జరుగబోతున్నదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహేశ్‌కుమార్‌గౌడ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన ఒక్కరే ఢిల్లీకి వెళ్లి అధినేత రాహుల్‌గాంధీని కలిసి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందని, అప్పుడు బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారని అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యనేతను ఇబ్బంది పెట్టినట్టు పార్టీ క్యాడర్ చెప్తున్నది. అప్పటినుంచే ఆయన్ను టార్గెట్ చేస్తూ వచ్చారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. వీటికితోడు వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా చానల్‌కు చెందిన బంధువుకు మహబూబాబాద్ డీసీసీ పదవి ఇవ్వలేదని, ఇవన్నీ కలగలిసే టీపీసీసీ అధ్యక్షుడికి చెక్‌పెట్టే ప్రయత్నంలో భాగానే కథనాలు ప్రసారం చేస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యనేత కనుసన్నలో సాగే టీవీ చానల్ ప్రసారం చేస్తున్నట్టు గాంధీభవన్‌లో బీరు బాటిళ్లకు, గోడకు ఊడుతున్న పెచ్చులకు అధ్యక్షుడికి ఏం సంబంధం? మహేశ్‌కుమార్‌గౌడ్ కంటే ముందు రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కంటే ముందు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పదవిలో ఉన్నారు. అప్పుడూ ఇప్పుడూ గాంధీభవన్ పరిస్దితి ఇలాగే ఉన్నదని, అవన్నీ మహేశ్‌కుమార్ గౌడ్ ఖాతాలోనే వేయడం ఎందుకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.