KTR | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఝలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మెజార్టీ కోసం గులాబీ శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కష్టపడి పనిచేయాలని, మాగంటి గోపీనాథ్ చేపట్టిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన సతీమణి సునీత విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతోనే బుద్ధిచెప్పాలని కోరారు. ‘పింఛన్లు పెంచుతం.. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తం.. పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారమిస్తం.. యువతులకు స్కూటీలిస్తమని చెప్పి ధోకా చేసిన హస్తం పార్టీని బొందపెట్టాలి’ అని పిలుపునిచ్చారు. యావత్ తెలంగాణ ప్రజానీకం జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నదని, చైతన్యవంతమైన జూబ్లీహిల్స్ ప్రజలు గుద్దుడు గుద్దుతే కాంగ్రెస్ తుక్కుతుక్కు కావాలని సూచించారు.
శనివారం షేక్‌పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలోనే నగరం అన్ని రంగాల్లో ముందునిలిచిందని గుర్తుచేశారు. ‘బతుకమ్మకు కేసీఆర్ ఆడబిడ్డలకు చీరె పెడుతున్నరు.. పురుడుపోసుకున్న మహిళలకు కేసీఆర్ కిట్ ఇస్తున్నరు.. బిడ్డ లగ్గమైతే రూ.లక్ష కట్నం పెడుతున్నరు.. పేదోళ్లను కడుపులో పెట్టి చూసుకుంటున్నరని మీరంతా గుర్తించి జూబ్లీహిల్స్ సహా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సీట్లల్లో బీఆర్ఎస్ను గెలిపించిండ్రు.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ను ఆదరించిండ్రు’ అని గుర్తుచేశారు. ఊర్లల్లో ఉన్నవారు రైతుబంధు, దళితబంధు, ఆసరా పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్సోళ్లు చెప్పిన మాటలు విని మోసపోయారని, నమ్మి ఓటేసిన పాపానికి అరిగోస పడుతున్నారని, అందుకే తమలా మోసపోవద్దని జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసేందుకు వస్తామంటున్నారని చెప్పారు.
కేసీఆర్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి
పదేండ్ల పాలనలో హైదరాబాద్‌ను కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని, నగర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కేటీఆర్ కొనియాడారు. ‘షేక్‌పేటలో ఫ్లైఓవర్ కట్టినం.. మల్కపేట చెరువును పునరుద్ధరించినం.. రూ.5కే మంచి భోజనం పెట్టినం.. సుస్తీచేస్తే బస్తీ దవాఖాన పెట్టినం.. హిందువులకు బతుకమ్మ చీర, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుక అందజేసినం. కులమతాలకతీతంగా అన్నివర్గాలను కడుపులో పెట్టి చూసుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కింది’ అని వివరించారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు బ్రహ్మాండంగా ఓట్లతో కేసీఆర్‌ను ఆశీర్వదించారని చెప్పారు.
ఉచిత నీటి పథకంపై కుట్ర
నగరంలో కేసీఆర్ తెచ్చిన 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకాన్ని ఎత్తేసేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ఆడోళ్లకు ఫ్రీ బస్సు ఇచ్చి మొగోళ్లకు టికెట్ రేట్లను డబుల్ చేసిందని, చదువుకునే పిల్లల బస్‌పాస్ చార్జీలను 25 శాతం పెంచి వంచించిందని ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు అత్తకు రూ.4000, కోడలుకు రూ.2500, గ్యాస్, కరెంట్ ఫ్రీ, పింఛన్లు డబుల్ చేస్తం.. యువతులకు స్కూటీలు, బిడ్డల లగ్గానికి తులం బంగారం ఇస్తామన్నరు. ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీ కార్డులు ఇచ్చి 100 రోజుల్లోనే అన్నీ చేస్తమని నమ్మబలికిండ్రు. 800 రోజులు దాటినా ఏదీ అమలు చేయలేదు’ అని నిప్పులు చెరిగారు.
వాటాల కోసం సీఎం, మంత్రుల కొట్లాట
ప్రజలను గాలికొదిలి ఢిల్లీ చుట్టూ రేవంత్‌రెడ్డి చక్కర్లు కొడుతున్నారని, పాలన వదిలేసి మూటలు మోస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కంపెనీలు, పనుల్లో వాటాల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇదీ తాను చెప్పడంలేదని, ఓ మంత్రి కూతురే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ అగ్రికల్చర్‌ను తెస్తే రేవంత్‌రెడ్డి గన్‌కల్చర్ తెచ్చారని చురకలంటించారు. ఆయన అనుచరులు శాఖల వారీగా పంచుకొని దోపిడీ పర్వానికి తెరలేపారని, మంత్రులేమో పనులు చక్కబెట్టుకుంటూ పైసలు లెక్కబెట్టుకుంటున్నారని తూర్పారబట్టారు. ప్రజలు కాంగ్రెస్, కేసీఆర్ పాలనకు తేడా తెలుసుకోవాలని కోరారు. దగా చేసిన కాంగ్రెస్‌ను పాతరవేయాలని విజ్ఞప్తిచేశారు.
పేదల బతుకులు అతలాకుతలం
‘రేవంత్ పాలనలో ఒక్క ఇటుక పేర్చలే.. తట్టెడు మట్టి ఎత్తలే.. ఒక్క ఇల్లు కట్టలే.. కానీ హైడ్రా తెచ్చి పేదల బతుకులను అతలాకుతలం చేస్తున్నడు’ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. పొద్దున లేస్తే మైకులు పట్టుకొని కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు ఉద్ధరించిందేమీలేదని మండిపడ్డారు. ‘జూబ్లీహిల్స్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలు ఇవ్వకున్నా, 420 హామీలు నెరవేర్చకున్నా, స్కూటీలు ఇవ్వకపోయినా, పింఛన్లు, దళితబంధు పెంచకున్నా..తులం బంగారం, కేసీఆర్ కిట్లు ఇవ్వకపోయినా తమను ప్రజలు నమ్మారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకునే ప్రమాదం ఉన్నది’ అని హితబోధ చేశారు. రాష్ట్ర ప్రజానీకం జూబ్లీహిల్స్ ఫలితం కోసమే ఎదురుచూస్తున్నారని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మాటతప్పిన కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.
బాకీకార్డు చూపెట్టి గల్లాపట్టి అడగండి
ముస్లింలకు బడ్జెట్లో రూ.4 వేల కోట్లు ఇస్తామని, మైనార్టీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ధోకా చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకుల ముందు బాకీకార్డులు పెట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలకు బాకీపడ్డ రూ. 60 వేలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.48 వేలు, అన్నదాతలకు రెండు విడుతల రైతుబంధు ఇవ్వండని అడగాలని కోరారు. కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మి ఓటేస్తే మరో మూడేళ్లు మోసపోవాల్సి వస్తుందన్న విషయాన్ని విస్మరించవద్దని సూచించారు. అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్‌ను కాపాడుకోవాలంటే జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుపెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, ముఠా జయసింహ, నందికంటి శ్రీధర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరింది వీరే..
షేక్‌పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, శేషురాజు, వినయ్‌రాజు, గణేశ్, రోహిత్, శ్రీకాంత్, నవీన్, వెంకటేశ్, శివాజీ, రోహిత్, డాక్టర్ విద్యారాణి, సంగీత, మేఘన, దివ్య, రాజేశ్వరీ, భాగ్యలక్ష్మి, శ్రీదేవీ, విజయ, లావణ్య బీఆర్ఎస్లో చేరారు.
కలిసికట్టుగా బీఆర్ఎస్ బలాన్ని చాటాలి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ బలాన్ని చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి హైదరాబాద్, జూబ్లీహిల్స్ అభివృద్ధికి కేసీఆర్ పాలనలో చేసిన కృషిని, పూర్తిచేసిన పనులను విడమరిచి చెప్పాలని ఉద్బోధించారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన పనులను వివరిస్తూనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు. గడపగడపకు వెళ్లీ బాకీ కార్డులు పంచి రేవంత్ సర్కారు మోసపూరిత విధానాలను వివరించాలని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీత గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారశైలిపై దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగర ప్రజలు కేసీఆర్‌పై నమ్మకముంచి 100 శాతం సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరమున్నదని స్పష్టంచేశారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్లకు స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. కేసీఆర్ పాలనలో గల్లీల్లో రహదారుల నిర్వహణ, ఎస్ఆర్డీపీ నిధుల ద్వారా నిర్మించిన ఫ్లైఓవర్లు, 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం, నిరంతర నీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి
హైదరాబాద్‌లో రోజురోజుకూ దిగజారుతున్న కనీస అవసరాలైన పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ లాంటి సమస్యలను ప్రజలకు వివరిస్తూ హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించి రాజకీయ డ్రామాలతో ప్రజలను రేవంత్ సర్కారు మోసం చేస్తున్న తీరును విడమర్చిచెప్పాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ మోసాలను, హైడ్రా పేరిట సాగించిన విధ్వంసాన్ని, దందాలు, చందాల వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుపు జీహెచ్ఎంసీ గెలుపునకు నాంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, కార్యకర్తలు, నాయకులు సమష్టిగా ముందుకుసాగితే మూడోసారి జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందని, సమీస భవిష్యత్తులో పార్టీ మారిన ఖైరతాబాద్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం, ఉపఎన్నికలు రావడం ఖాయమని స్పష్టంచేశారు.
కేసీఆర్ హయాంలో సకల హంగులతో విలసిల్లిన నగరం.. రేవంత్‌రెడ్డి 22 నెలల పాలనలో నరకం చూస్తున్నది. కేసీఆర్ తెచ్చిన 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకాన్ని ఎత్తేసేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నది. ఆడోళ్లకు ఫ్రీ బస్సు ఇచ్చి మొగోళ్లకు టికెట్ రేట్లను డబుల్ చేసిండ్రు. చివరికి చదువుకునే పిల్లల బస్‌పాస్ చార్జీలను 25 శాతం పెంచి వచించిండ్రు.
-కేటీఆర్
ముల్లును ముల్లుతోనే తీసినట్టు ద్రోహపూరిత కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధిచెప్పాలి. చైతన్యవంతమైన జూబ్లీహిల్స్ ప్రజలు ధోకా చేసిన పార్టీని బొందపెట్టాలె. గుద్దుడు గుద్దుతే హస్తం పార్టీ తుక్కుతుక్కు కావాలె. కాంగ్రెస్సోళ్ల మోసపూరిత మాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ నట్టేట మునుగుతం. ఆశలకు పోతే మూడేండ్లు అరిగోస పడాల్సి వస్తది.
-కేటీఆర్
పాలన చెయ్యిమని అధికారమిస్తే ప్రజలను గాలికొదిలి రేవంత్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నడు. పాలన పక్కనబెట్టి మూటలు మోసే పనిలో మునిగి తేలుతున్నడు. కంపెనీలు, పనుల్లో వాటాల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు కొట్టుకుంటున్నరు. ఇది నేను చెప్తలేను.. ఓ మంత్రి కూతురే స్వయంగా చెప్పిండ్రు. కేసీఆర్ అగ్రికల్చర్‌ను తెస్తే రేవంత్‌రెడ్డి గన్‌కల్చర్ తెచ్చిండు. -కేటీఆర్