వరంగల్, నవంబర్ 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష నిర్వహించే ప్రాంగణంలోనే కాంగ్రెస్ బహిరంగసభ పెడుతున్నది. పరీక్షలు ముగిసిన తర్వాత రోజు బహిరంగ సభ ఉన్నా.. దీని ఏర్పాట్ల కోసం పరీక్ష రాసే వారికి ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్నది. టీఎస్పీఎస్సీ ఆది, సోమవారాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షల కోసం వరంగల్ నగరంలో సెంటర్లను ఎంపిక చేసింది. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సెంటర్ ఏర్పాటు చేసింది. వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాయనుండగా, శనివారం సాయంత్రం నుంచే ఈ కళాశాల పోలీసుల పర్యవేక్షణలోకి వెళ్లింది. మరోవైపు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 19న బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సభ నిర్వహణ కోసం శనివారం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు, ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్నంత సేపు కాంగ్రెస్ బహిరంగ సభ కోసం పనులు చేపట్టనున్నారు. పరీక్ష సమయంలోనే సభ, వేదిక ఏర్పాట్ల కోసం అవసరమైన సామగ్రిని లారీల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోకి తీసుకురానుండటంతో అభ్యర్థుల ఏకాగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 127 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆది, సోమవారాల్లో ఉదయం 10 నుంచి సాయ ంత్రం 5.30 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సభలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధించినట్టు పేర్కొన్నారు.