హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికుల హ క్కులు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి కార్మికలోకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నదని నిప్పులు చెరిగారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి సంస్థను నిర్వీర్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సైతం సింగరేణిని చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుపై తాత్సారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తనను మరోసారి టీబీజీకేఎస్ సారథ్య బాధ్యతలు అప్పగించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో కార్మికుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్థ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తుస్తూ కా ర్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని ఆరోపించారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా టీబీజీకేఎస్‌తోపాటు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానా లపై పోరాటాలకు సిద్ధంగా కొప్పుల ఉండాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. బుధవారం తెలంగాణ భవన్లో సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన ని ర్వహించిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కో ల్బెల్ట్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధుకర్, హరిప్రియానాయక్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రె సిడెంట్ మాదాసు రామ్మూర్తి కొప్పుల పేరును ప్రతిపాదించగా, సభికుల హర్షద్వానాల మధ్య ఆమోదించారు. సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై చర్చించా రు. పలు కీలక నిర్ణయాలు తీసుకొని తీర్మానాలను ఆమోదించారు. సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా ‘కాంగ్రెస్ హటావో- సింగరేణి బచావో’ పేరిట యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ సురేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.