మోర్తాడ్, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అద్దంపట్టిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నదని, అందుకే మంత్రులు, ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా వాగుతున్నారని మండిపడ్డారు. సభకు లక్షలాదిగా జనం తరలిరావడం, కేసీఆరే మళ్లీ రావాలి.. అంటూ నినాదాలు చేస్తూ నిండు మనసుతో మద్దతు తెలిపారని పేర్కొన్నారు. దీనిని చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ఆగమేఘాలపై సభ సక్సెస్ కాలేదని మీడియాతో మాట్లాడుతూ స్వీయ ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ వాళ్లు కళ్లుండి వాస్తవాన్ని చూడలేకపోతున్నారని పేర్కొన్నారు. 17 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత.. సభకొచ్చిన లక్షలాది ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను ఇతర యంత్రాంగాన్ని వాడుకుని సభను అడ్డుకునే కుట్రలు చేయాలని చూశారని తెలిపారు. ఆ కుట్రల వల్ల బయట రోడ్లపై లక్షలాది మంది ప్రజలు ఉండిపోయారని తెలిపారు. కేసీఆర్ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి సునామీలా సభకు తరలివచ్చారని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 40 వేల మంది ఎల్కతుర్తి సభకు తరలివెళ్లినట్టు తెలిపారు.