BC Reservations | హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది. కోటా పెంపుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకొనేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. రిజర్వేషన్లపై తమ పార్టీ రెండుగా చీలిపోయిందంటూ ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ కపట నాటకాలను నమ్మేది లేదని అటు ప్రజలు, ఇటు బీసీ సంఘాలు తేల్చి చెప్తుండటంతో కొత్త ప్లాన్ను తెరమీదికి తెచ్చినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోనంబర్ 9పై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరుగనున్న సంగతి తెలిసిందే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన 27 శాతం రిజర్వేషన్ల మీదనే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో నాలుగు బీసీ సంఘాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. నాలుగు సంఘాలు వేర్వేరుగా కేసులో ఇంప్లీడ్ కావటానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. 8న జరుగబోయే విచారణలో ప్రభుత్వం వెనక్కి తగ్గినా, తాము న్యాయపోరాటం కొనసాగించాలని సంఘాలు నిర్ణయించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీలకు గాలం వేసేందుకు కొత్త నాటకాలు తెరమీదికి తెచ్చినట్టు చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను కోర్టు నిలిపివేస్తే.. పార్టీ పరమైన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించినట్టు చెప్తున్నారు. దీంతోపాటు.. బీసీ సంఘాల న్యాయ పోరాటానికి కాంగ్రెస్ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అండగా నిలవాలని నిర్ణయించినట్టు ప్రచారం బయటికి వచ్చింది. ఈ మేరకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ ముఖ్యనేతలు కొందరు మంగళవారం రాత్రి రహస్యంగా సమావేశం అయినట్టు లీకులు వదిలారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను గవర్నర్ ఆమోదించకుండానే కేంద్రప్రభుత్వానికి పంపినప్పుడే సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేయాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారట.
54 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయన, సంబంధించిన బ్యూరోక్రాట్లను వెంటేసుకొని పోయి ఒక్కసారి కూడా ప్రధాన మంత్రినిగానీ, రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదానికి ఒప్పించే ప్రయత్నమే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకూల వ్యక్తుల ద్వారా బయటికి ప్రచారం చేశారు. మరోవైపు.. పిటిషన్ వేసిన రెడ్డి జాగృతి నేతలను ఉసిగొల్పిందే కాంగ్రెస్ పార్టీలోని రెడ్లు అని బీసీ మంత్రులు అన్నట్టు చెప్పుకొచ్చారు. గ్రామ స్థాయి పదవుల్లో మేజర్ వాటా బీసీల చేతికి వెళ్తే.. భవిష్యత్తులో అంతే మొత్తం వాటా అసెంబ్లీ స్థానాలు అడుగుతారని, అదే జరిగితే రాజ్యాధికారం చేతులు మారుతుందని రెడ్డి సామాజికవర్గ నేతలు ఆదోళన చెందుతున్నట్టు కూడా ప్రచారం మొదలైంది. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్లో చీలిక తెచ్చిందని ప్రచారం చేస్తున్నారు.
బీసీలపై కాంగ్రెస్ చేస్తున్న నాటకానికి ఆకర్షితులు కావొద్దని బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్లో నిజంగానే బీసీల పట్ల ఆ సామాజిక వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రేమ ఉంటే ఒక్కరైనా బయటికి వచ్చి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఒక్క బీసీ నేత అయినా మీడియా ముందుకు వచ్చి, కాంగ్రెస్ పార్టీ, రెడ్డి సామాజికవర్గం నేతలు చేస్తున్న మోసాన్ని బయట పెట్టలేరా? అని ప్రశ్నిస్తున్నారు. బీసీ సంఘాలు కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెరమీదికి రావడమే అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ఒకవేళ ప్రభుత్వం పాత రిజర్వేషన్లే అమలు చేస్తామని చెప్తే కాంగ్రెస్ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటికి వస్తారా? అని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చేసే డ్రామాలకు తాము ఆకర్షితులం అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు.