హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : గొప్పలు చెప్పుకుందామని ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి పార్లమెంట్ సాక్షిగా భంగపాటు ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అధినేతల ఎదుట పరువు పోగొట్టుకొని అవమాన భారంతో హైదరాబాద్ బాటపట్టారు. తన గొప్పలు..తిప్పలపై మీడియాకు ఏం చెప్పాలో అర్థంకాక మాటలు తడబడ్డారు. తాను చెప్పాలనుకున్న గ్లోబల్ సమ్మిట్ గొప్పలను మర్చిపోయి మెస్సీ ముచ్చట ముందేసుకున్నారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఒక అతిథిగా మాత్రమే ఈవెంట్‌కు హాజరవుతున్నానని చెప్పారు. గురువారం ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సందర్భంగా ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. ఢిల్లీ మీడియా అడగని ప్రశ్నకు సీఎం సమాధానం చెప్పడంతో అశ్చర్యపోయిన మీడియా ప్రతినిధులు వాస్తవ పరిస్థితిపై ఆరా తీయగా ఆసక్తికర విషయం తెలిసింది.
60వసారి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన అంశాలపై వారితో చర్చించినట్టు తెలిసింది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిషరణ, గ్లోబల్ సమ్మిట్‌పై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. 44 దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చారని రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదిరినట్టు రేవంత్‌రెడ్డి వారికి వివరించినట్టు తెలిసింది. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ వస్తున్నారని, ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది.
ఈ కార్యక్రమానికి అతిథిగా రావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్‌రెడ్డి ఆహ్వానించినట్టు సమాచారం. కొంత ఆసక్తి చూపిన రాహుల్.. ‘ఈవెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారా?’ అని అడిగినట్టు తెలిసింది. ఊహించని ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కానీ రేవంత్‌రెడ్డి ‘ప్రైవేట్ ఈవెంటే కానీ రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది’ అని చెప్పినట్టు సమాచారం. దీనికి రాహుల్ బదులిస్తూ ‘ప్రైవేట్ ప్రోగ్రాంను ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవడం ఏమిటీ? దానికి మమ్మల్ని ఆహ్వానించడం ఎందుకు?’ అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఇలా చెప్తే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? చీల్చి చెండాడుతాయి’ అని రేవంత్‌కు సూచించినట్టు తెలిసింది.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతూ సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఆవరణలో మీడియా ముందుకొచ్చారు. కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. మెస్సీ ఈవెంట్‌ను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నదని, ప్రభుత్వం కేవలం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తాను ఒక అతిథిగా మాత్రమే హాజరవుతున్నానని చెప్పారు. ఈ ఈవెంట్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు ముక్తసరిగా వెల్లడించారు. సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ‘తనది కాని, తనకు సంబంధం లేని విషయాల్లో కొందరు అనవసరంగా జోక్యం చేసుకొని హడావుడి చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ గ్రామాల్లో మోటు సామెతతో ఒక్కమాటలో చెప్తుంటారు.
సీఎం రేవంత్‌రెడ్డి పరిస్థితి కూడ అచ్చంగా అలానే కనిపిస్తున్నది’ అని కొందరు నెటిజన్లు చతురోక్తులు పేల్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కానప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఈ ఈవెంట్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ప్రత్యేకంగా ఎట్లా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. ఇది ప్రైవేట్ కార్యక్రమమైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఏర్పాట్ల పరిశీలన కోసం ఉప్పల్ స్టేడియానికి ఎలా పంపిస్తారని నిలదీస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బు రూ.5 కోట్లు ఖర్చు చేసి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుట్‌బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయించి, ముఖ్యమంత్రి ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారని, ఎందుకు హడావుడి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఫుట్‌బాల్ దుస్తులతో రోజుకోచోట ప్రమోషన్ వర్క్ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు.