రైతుబంధు నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా ప్రతి ఏటా రైతులకు దక్కాల్సిన దాదాపు రూ.15 వేల కోట్లకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది! ‘సాగు చేసిన పంటకే రైతుబంధు ఇస్తాం’ అనే నిబంధన పెట్టి, ఇంత పెద్ద మొత్తంలో రైతుల జేబులకు చిల్లు పెట్టబోతున్నది.
అంతేకాదు, వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని సాగు లెక్కలు తీసే పేరుతో నెలల తరబడి ఆలస్యం చేసి, వారిని వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయబోతున్నది. అప్పుల విష వలయంలోకి నెట్టబోతున్నది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల లోగుట్టు ఇదే.
Rythu Bharosa | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధుతో ఇన్నేళ్లపాటు పెట్టుబడికి రంది లేకుండా, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయకుండా పంటలు సాగు చేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ అప్పుల తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టే విధానాలకు తెరలేపింది.
రైతుబంధు పథకానికి కోతలేసి, ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రైతుల బతుకులను ఆగమాగం చేసేందుకు సిద్ధమవుతున్నది. రైతుబంధు నిబంధనల్లో మార్పులు చేస్తామని, ఇక రైతులందరికీ ఇచ్చేది లేదని, సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తామని, దానికీ పరిమితి విధిస్తామని కాంగ్రెస్ నేతలు తెగేసి చెప్తున్నారు. ఒకవైపు రైతుబంధుకు కోతలేస్తూ, మరోవైపు ఆలస్యంగా పెట్టుబడి సాయం ఇస్తుండటంతో రైతులు మళ్లీ ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటున్నది.
ఇక పంట కోతల తర్వాతే రైతుబంధు!
వ్యవసాయ శాఖ రైతుబంధులో మార్పులపై కసరత్తు మొదలుపెట్టింది. ఇకపై రైతులందరికీ, మొత్తం భూమికి రైతుబంధు ఇవ్వకూడదని, పంట సాగు చేసిన భూమికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దీంతో పంట సాగు లెక్కలు తేలిన తర్వాత మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. పంటలు వేసిన భూముల లెక్కలు తీసి, వాటిని అధికారులు ప్రభుత్వానికి సమర్పించి, రైతుల ఖాతాల్లో జమ చేసేలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది.
వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందాల్సిన పెట్టుబడి సాయం పంటల కోతలు ముగిసే సమయానికి కాని అందదు. దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో రైతుల ఖాతాల్లో సుమారు రూ.7,500 కోట్లు జమ చేసింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ఆరంభంలో కాకుండా పంట కోతల సమయంలో రైతుబంధు ఇస్తే, రైతులు ఆ మేరకు అంటే దాదాపు రూ.7,500 కోట్ల అప్పు చేయకతప్పదు. దీంతో మళ్లీ గ్రామాల్లో షావుకార్లు, వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతారు.
బారువడ్డీలు, చక్రవడ్డీల పేరుతో రైతులను పీల్చిపిప్పి చేసిన పాత రోజులు మళ్లీ వస్తాయి. దీంతో రైతుల రెక్కల కష్టం వడ్డీలకు కూడా సరిపోని దుస్థితి వస్తుంది. తద్వారా రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నది. అంతేకాకుండా, రైతులు తాము పండించిన పంట మొత్తం తమకు అప్పులు ఇచ్చిన షావుకార్లు, వడ్డీ వ్యాపారులకు అడ్డికి పావుశేరుకే అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఒక్క రైతుబంధు పథకంలో మార్పుల వల్ల రైతుల బతుకులు అనేక విధాలుగా ఆగమాగం కానున్నాయి.
రైతులకు అప్పుల తిప్పలు తప్పించిన కేసీఆర్
రైతుబంధు పథకాన్ని కేసీఆర్ ఆషామాషీగా అమలు చేయలేదు. ఉద్యమ నేతగా, సుదీర్ఘ అనుభవంగల రాజకీయ నేతగా ఆయన క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు, పంట పెట్టుబడి కోసం పడుతున్న బాధలు, వడ్డీ వ్యాపారుల అరాచకాలు, వేధింపులను గమనించారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది అప్పుడు దేశంలో, ప్రపంచంలో ఒక సంచలనం.
కేసీఆర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతోపాటు అనేక రాష్ర్టాలు అనుసరించాయి. కేసీఆర్ ఈ పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలుచేశారు. రైతు రైతే.. చిన్న రైతా, పెద్ద రైతా అనే తేడా లేదు. ఏ రైతు అయినా సరే పంట పండించాలంటే పెట్టుబడి పెట్టాల్సిందే. అందుకే ఆయన ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేశారు. ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించారు. ఇది తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది. వారు సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. ఈ పథకం ద్వారా కేసీఆర్ రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన తిప్పలను తప్పించారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి మోక్షం కలిగించారు. అందుకే ఎప్పుడూ కేసీఆర్ ఒక మాట చెప్తుంటారు.. ‘కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతుబంధు ఆగదు. కోతలు పెట్టబోను’ అని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ మాటకు కట్టుబడి ఉన్నారు.
ఏ ఒక్క రైతూ రైతుబంధు కోసం అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా, రైతులను పీడించే ఏ చిన్న అవకాశం కూడా అధికారులకు ఇవ్వకుండా పకడ్బందీగా అమలు చేశారు. ఎంతో గొప్ప ఆశయంతో, రైతుల అప్పుల బాధలను తప్పించాలనే సంకల్పంతో కేసీఆర్ అమలుచేసిన ఈ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తూట్లు పొడుస్తున్నది. దీనికి రాజకీయరంగు పులిమి రైతులను మళ్లీ బలిపీఠంపై ఎక్కించే ప్రయత్నం చేస్తున్నది.
రైతులపై మోయలేని భారం
రైతుబంధులో మార్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు రైతులపై భారీ మొత్తంలో ఆర్థిక భారాన్ని మోపనున్నది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి సుమారు కోటి ఎకరాలకుపైగా భూమికి రైతుబంధును ఎగ్గొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఒక్కొక్క ఎకరాకు రూ.15 వేల చొప్పున కోటి ఎకరాలకు రూ.15 వేల కోట్లు ఎగ్గొట్టనున్నది. అంటే ఆ మేరకు రైతుల ఆదాయానికి ఒక్క కలం పోటుతో చిల్లు పెట్టనున్నది. వారికి దక్కాల్సిన పెట్టుబడి సాయాన్ని లూటీ చేయనున్నది. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ సంకుచిత, అనాలోచిత నిర్ణయాల కారణంగా జరగబోతున్న నష్టం.
పిల్ల పెరిగినంక కుల్లగుట్టినట్టుంది
పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టుంది అనేది ఎనుకటి సామెత.. ఎవరైనా పనిగాక ముందే తొందరపడితే దీనిని ఇమ్మడించేది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ ముచ్చట అందుకు ఉల్టా ఉంది. పిల్లపుట్టి పెరిగి పెద్దదైనంక కుల్ల గుట్టినట్టుగా ఉంది ఆయన ఇగురం. తెలంగాణ వచ్చినంక రైతులకు బలం ఇచ్చేందుకు కేసీఆర్ సార్ పొద్దంతా కరెంట్ ఇచ్చిండు. చెర్లు బాగు చేసిండు. పంప్‌హౌస్‌లు కట్టి వరద కాలువను నింపి యాడాది పొడువునా నీళ్లు ఉండెటట్టు చేసిండు.
దీంతో జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని ఊళ్లకు బలిమైంది.. రైతుబంధు పెట్టి ఆయుటి పూనంగనే ఎకరాన ముందు నాలుగువేలు, అటెన్క ఐదువేలు ఏసిండు.. నాకు రెండెకరాల ఆరుగుంటల భూమి ఉంది. పదివేలు పడేవి. ఆయుటి పూనంగ, యాసంగి మొదలు కాంగనే పైసలు పడేతోటే ఎవుసం పనులకు అక్కెరకు వచ్చినయి. అడుగుమందుకు, ఇత్తునంకు, టాక్టర్ దున్నెందుకు ఆ పైసలు అచ్చినయి.
ఇప్పుడు రేవంతం సార్ పొలమేసి, కోసి, అడ్లు అమ్ముకున్నంక రైతుబంధు పైసలు ఇత్తున్నా అంటుండు. ఇప్పుడెందుకు రైతుబంధు పైసలు. ఇది పోగువోశె ముచ్చటలెక్క లేదు. రైతుకు పైసలు మొగులు మెత్తవడేటప్పుడు ఇయ్యాలె, లేకుంటే ఇత్తునం పెట్టె ముందన్న ఇయ్యాలె. ఈ సర్కార్ లెక్కసూత్తె రైతుకు లాభం అయ్యేటట్టు కనిపిత్త లేదు. మళ్ల కేసీఆర్ అత్తెనే రైతుకు లాభమయితది. ఆయన అచ్చెదాక రైతులకు తిప్పలు తప్పవు.
– గొట్టం నారాయణ, రైతు, రాంపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా
సాగుభూమికే రైతుబంధు ఇస్తామనడం సరికాదు
కాంగ్రెస్ ప్రభుత్వం సాగు భూమికే రైతుబంధు ఇస్తామనడం సరికాదు. గతంలో రైతులకు సీజన్ల వారీగా రైతుబంధు వచ్చేది. రైతుబంధు విషయంలో ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు పూటకో మాట మాట్లాడుతూ అయోమయానికి గురిచేస్తున్నారు. పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు క్రమం తప్పకుండా వేయాలి. పూటకో మాట మాట్లాడి కాలయాపన చేయడం సమంజసం కాదు.
-కుర్వ ఈరప్ప, గోపాల్పూర్, పెద్దేముల్ మండలం, వికారాబాద్ జిల్లా
కాంగ్రెస్ ఇబ్బంది పెడ్తున్నది
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కావాల్సినంత కరెంట్ వస్తుండే. వానలు పడే సమయంలో, పంటలు వేసే ముందు రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం ఇస్తుండే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఘోరంగా తయారైంది. పంట వేసినోళ్లకే రైతుబంధు ఇస్తమంటే , పంటలు పండని రైతుల పరిస్థితేంది. అందరికీ రైతుబంధు ఇవ్వాలి. ఎక్కడవడితే అక్కడ సీఎంతోపాటు మంత్రులు ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తామని చెబుతున్రు. గత ప్రభుత్వం అందరికీ ఎట్టిచ్చింది. ఈ ప్రభుత్వం ఎందుకిస్తలేదు. గెలిచినంక ఐదెకరాలని కొర్రీలు పెట్టుడు కరెక్టు కాదు.
-సాయిలు యాదవ్, కొల్లూర్, బాన్సువాడ మండలం,
రైతుబంధు రాకపాయే
నాకు మా ఊళ్లో నాలుగెకరాలు ఉంది. యాసంగి పెట్టుబడి సాయం అందలేదు. గతేడాది కేసీఆర్ సర్కారు సమయానికి రైతుబంధు డబ్బులేసిన్రు. ఎకరానికి రూ. 5 వేల చొప్పున రూ. 20 వేలు ఖాతాల పడ్డయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక యాసంగి పెట్టుబడి ఇవ్వకపాయె. అప్పులు చేసి పంటలేసినం. రైతుబంధు వస్తుందనే నమ్మకం పోతున్నది. పంట సాగు చేసిన తర్వాత రైతుబంధు ఇస్తామని సీఎం రేవంత్ చెబుతున్నడు. పెట్టుబడి సాయం పంటలకు ముందిస్తేనే మేలైతది. లేదంటే వడ్డీలకు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. పంటలేసిన తర్వాత సర్వే చేసి పైసలిస్తరట. అప్పుచేసి పంటలేసిన తర్వాత రైతుబంధు ఇస్తే ఏం లాభం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను అరిగోస పెడ్తుంది.
– శంకర్, రైతు, పెంచికల్పేట్, కుమ్రంభీం ఆసిఫాబాద్
పంట వేసేటప్పుడే ఇయ్యాలె
నాకు నాలుగెకరాల భూమి ఉంది. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్న. రైతులకు మంచి చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆరే. రైతుల కష్టసుఖాలను ఎరిగి రైతుకు పెట్టుబడి సాయం చేసిండు. అది కూడా పంట వేసే ముందే ఇచ్చేది. పంట పెట్టుబడి కోసం షావుకారి దగ్గర అప్పు తెచ్చే బాధలు తప్పినయ్. పదేండ్లు ఎవుసం పండుగలా సాగింది. కాంగ్రెస్ సరారు వచ్చిన నాలుగు నెలలకే రైతులను ఆగం చేసింది. పెట్టబడి సాయం టైంకు అందక తిప్పలు పడ్డ. అప్పులు వేవడంతో వడ్డీ మీద పడ్డది. యాసంగిలో నీళ్లు రాక పంట ఎండిపోయింది. రైతు గోసను రేవంత్ సరారు పట్టించుకోలేదు. యాసంగి పెట్టుబడి సాయాన్ని ఎలక్షన్ల నాలుగు రోజుల ముందు ఇవ్వటం ఓట్ల కోసం కాదా? రైతులను రాజకీయంగా వాడుకోవడం మంచి పద్ధతికాదు. రైతులను ఓట్లేసే యంత్రాల్లా చూస్తున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్తం.
– మేకల వీరేశం, పెరపల్లి, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా
పెట్టుబడికి అప్పు తేవాల్సి వచ్చింది
నాకున్న మూడెకరాళ్ల వరి పంట వేసిన. యాసంగి టైముకు రైతుబంధు డబ్బులు పడకపోవడంతో అప్పుతెచ్చి ఎరువులు, విత్తనాలుకొని నాటేసిన. ఆ తర్వాత ఇరవై రోజులకు రైతుబంధు డబ్బులు ఖాతాలో పడ్డయి. ఐదెకరాలున్న రైతులకు వరి పంట కోత అయి ధాన్యం అమ్మినంక నాలుగు రోజుల కింద డబ్బులు పడ్డయి. మూడు రోజుల్లో ఎలచ్చన్లు ఉన్నయని కాంగ్రెస్ సర్కారు ఈ రైతుబంధు యేసింది. ఎన్నికలు లేకుంటే ఐదెకరాలున్న రైతులకు వేసునో వేయకపోవునో. కేసీఆర్ సారు రైతుబంధు ఇవ్వలేని ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లే అయింత డబ్బులు వేసిండ్రు. గత ప్రభుత్వంలో సీజన్ ప్రారంభం ముందే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమయ్యేది. వానకాలం సీజన్ ఇరవై రోజుల్లో మొదలు కానుంది. ఇప్పుడైనా రైతుబంధు ముందే వేస్తే రైతులకు ఆసరాగా ఉంటది. లేదంటే పెట్టుబడుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల ఎంబడి తిరగక తప్పది.
– సుల్గూరి రమేశ్, రైతు, భీంపల్లి, కమలాపూర్, హనుమకొండ