Meenakshi Natarajan | ఒక పాదయాత్ర ఏ కుర్చీ కూలుస్తుందో! ఎవరి పదవికి ఎసరుపెడ్తుందో!.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడిదే చర్చ. పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ మీనాక్షి నటరాజన్ ఒక్కో అడుగు కలకలం రేపుతూ వస్తున్నది. అధిష్ఠానం పచ్చజెండాతో ఇప్పుడామె ఏకంగా పాదయాత్రకే దిగుతుంటే అధికార పార్టీలో ప్రకంపలు అంతాఇంతా కాదు. ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్షాలు పాదయాత్రను ఒక అవకాశంగా, అస్త్రంగా చూస్తాయి. కానీ అధికారంలో ఉండీ పాదయాత్రకు వెళ్లడం ఒక వింత! ప్రభుత్వంలో ఏ బాధ్యతా లేని వ్యక్తి పార్టీపరంగా ప్రజాసమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నది మరో ప్రశ్న.
సోనియా లేఖ తనకో ఆస్కార్, నోబెల్ అంటూ ఢిల్లీలో ఊగిపోయిన ముఖ్యమంత్రి రేవంత్.. ఆ పరవశం నుంచి బయటకు రాకముందే అధిష్ఠానం పాదయాత్రకు పచ్చజెండా ఊపడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర వ్యవహారాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నానని అధిష్ఠానం స్పష్టంచేస్తున్నదా? ముఖ్యమంత్రి, మంత్రులను నాయకత్వమే నమ్మడం లేదా? పార్టీలో సిసలైన ‘కమాండ్ కంట్రోల్’ తమదేనని ఢిల్లీ ఇస్తున్న సందేశమా? భవిష్యత్తులో పెనుమార్పులకు ఇది సంకేతమా?
(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)/ హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆ పార్టీ క్యాడర్, లీడర్లలో దడ పుట్టిస్తున్నది. అన్యూహ్యమైన ఆమె అడుగులు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ జాతీయ నేత ఏకంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వెళ్లడంపై శ్రేణులు ఎవరికివారుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రను ముఖ్యమంత్రి లేదా పీసీసీ చీఫ్ చేపడితే క్యాడర్లో ఇంత చర్చ ఉండేది కాదు. కానీ రాష్ట్రంతో సంబంధం లేని దూత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తనకు అత్యంత సన్నిహితురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్‌ను పాదయాత్రకు పంపడంపైనే క్యాడర్ లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మీ నాక్షి ఇంకా జనంలోకి వెళ్లకముందే.. రాహుల్ గాంధీ నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలు సృష్టించబోతుందేమోనన్న ఊహాగానా లు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో సీఎం శిబిరం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాస్తవిక పరిస్థితులను పరిశీలించి, గెలు పు గుర్రాలను గుర్తించి వారికి టికెట్లు ఇవ్వడం కోసమే మీనాక్షి పాదయాత్ర చేస్తున్నారనే ప్రచారాన్ని సీఎం శిబిరం జనంలోకి తీసుకెళ్తున్నది. అది పూర్తి అబద్ధమని, ఆమె పాదయా త్ర తీవ్రతను తగ్గించేందుకు సీఎం శిబిరం డైవర్షన్ రాజకీయం చేస్తున్నదని అసలు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ జాతీయ స్థాయి నేత క్షేత్రస్థాయిలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమర్థతను గుర్తించి టికెట్లు ఖరారు చేయడం సాధ్యం కాదని, అసలు పాదయాత్ర ఉద్దేశమే అది కాదని, రాష్ట్రంలో డమ్మీ సీఎం పరిపాలన సాగుతున్నదనే సంకేతాలను లీడర్‌కు, క్యాడర్‌కు ఇవ్వడం కోసమే అధిష్ఠానం ఆమెను జనంలోకి పంపిస్తున్నదని స్పష్టం చేస్తున్నారు.
రాష్ర్టాన్ని చెరో పక్క పంచిన అధిష్ఠానం
ఉమ్మడి ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రకు సంకల్పిస్తే.. అధిష్ఠానం 6 నెలలు ఆలోచించి ఆ తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అస లు కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయి న వారి కుటుంబాలను పరామర్శించేందుకు పాదయాత్ర చేస్తానని ఆయన కొడుకు జగన్మోహన్రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి పదేపదే ప్రాధేయపడినా అధిష్ఠానం కనికరించలేదు. ఇదే రేవంత్ ఒంటరిగా పాదయాత్ర చేస్తానని అధిష్ఠానాన్ని కోరినప్పుడు భట్టి విక్రమార్కను రంగంలోకి దించి రాష్ట్రంలో చెరోపక్క పాదయాత్ర చేసుకోవాలని ఆదేశించింది. పాదయాత్రకు హైకమాండ్ ఇచ్చే ప్రాధాన్యం అది. తా జాగా అధిష్ఠానమే ఏరికోరి మీనాక్షి నటరాజన్‌ను పాదయాత్రకు దింపడం, ఆమె పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం సాఫీగా సాగడం కోసం క్యాబినెట్ ప్రకటించిన ‘బీసీ బిల్లు కోసం ఢిల్లీ యాత్ర’ను సైతం వాయిదా వేయ డం వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందని చెప్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో మీనాక్షి పాదయాత్ర చేస్తున్నట్టు సీఎం శిబిరం ప్రచారం చేస్తుండగా ‘జై భీమ్..’ యా త్రకు కొనసాగింపుగా తాను పాదయాత్రకు సంకల్పించినట్టు మీనాక్షి చెప్తున్నారు. అంతర్గతంగా సీఎం రేవంత్ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసమే అధిష్ఠానం మీనాక్షితో పాదయాత్ర చేయిస్తున్నదని కాంగ్రెస్ ముఖ్యులు పేర్కొంటున్నారు. 15 నెలలుగా రేవంత్‌రెడ్డి శ్రమిస్తున్నా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరక్కపోవడం, కులగణన అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడం, కాంగ్రెస్ ఎంపీల ముందు కులగణన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ బాధ్యతలను సీఎంకు బదులు భట్టి విక్రమార్కకు అప్పగించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అథమస్థాయికి పడిపోతున్న తరుణంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రాధాన్యత సంతరించుకున్నదనే చర్చ సాగుతున్నది.
ఏమిటీ సంకేతం?
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా ఇన్చార్జి మంత్రులు బాధ్యత వహిస్తారని సీఎం రేవంత్ గతంలో ఏఐసీసీ నేతల సమక్షంలోనే ప్రకటించారు. తర్వాత మరుసటి రోజే మాట మార్చి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తానే స్వీకరిస్తానని ముందుకొచ్చారు. తాజాగా ఆ ఇద్దరినీ పక్కనపెట్టి మీనాక్షిని ముందుపెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తున్నది. క్షేత్రస్థాయిలో రేవంత్‌ను ముందుపెడితే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలవడం అసాధ్యమనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిలను రేవంత్ అతి సునాయాసంగా మేనేజ్ చేశారని, విషయాలను ఢిల్లీకి చేరకుండా జాగ్రత్తపడ్డారని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.
దీన్ని కొంత ఆలస్యం గా పసిగట్టిన రాహుల్‌గాంధీ, మీనాక్షి నటరాజన్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పంపించారు. ఆమె వచ్చీరావడంతోనే రాష్ట్ర ప్రభు త్వం అమ్మకానికి పెట్టిన హెచ్‌సీయూ భూములపై సమీక్ష పెట్టి సీఎం సన్నిహిత వర్గానికి ము చ్చెమటలు పోయించారు. లగచర్ల బాధితుల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వం పనితీరు, రాష్ట్రంలో పార్టీ గ్రూపుల వ్యవహారాలపై సమాచారం సేకరించి రేవంత్ దూకుడుకు కళ్లెం వేశారు. అప్పటి నుంచే పార్టీలో ఆయన ప్రభ తగ్గిపోవడం మొదలైందని కాంగ్రెస్ శ్రే ణులు చెప్తున్నాయి. అది ఎంత వరకు వెళ్లిందంటే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు పదవులు ఇప్పించుకోలేకపోయారని, వైరి వర్గానికి చెంది న ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవులను అడ్డుకోలేకపోయారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రేవంత్ ప్రమేయం లేకుండానే..
సాధారణంగా ప్రజా సమస్యలు తెలుసుకోడానికి ప్రతిపక్షాలు పాదయాత్రలు చేస్తుంటాయని, ఒక నాయకుడిని ప్రజల్లో ప్రొజెక్ట్ చేసేందుకు పాదయాత్రలు చేస్తుంటారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కానీ రాష్ర్టానికి చెం దని మహిళా నేత మీనాక్షిని యాత్రకు పంప డం వెనుక ఉద్దేశం ఏమిటో వారికీ అంతు చిక్కడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రంలో పాదయా త్ర చేపడుతున్నారనుకున్నా.. ఆమె వెంట సీఎం రేవంత్ కూడా నడవాల్సి ఉంటుందని, కానీ వ్యవహారాన్ని చూస్తుంటే ఆయన ప్రమే యం లేకుండానే యాత్ర షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం పాదయాత్రకు వెళ్తే అంతకంటే విడ్డూరం ఇంకొకటి ఉండదని, సీఎం వెళ్లకుంటే మీనాక్షి పాదయాత్రకు పబ్లిక్ రెలవెన్స్ లేనట్టేనని అంటున్నారు.
పాదయాత్ర కోఆర్డినేషన్ కమిటీలో సీఎం వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించకపోవడం మరో విశేషం. ఇటీవల ఐదుగురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్లారని, మూడో రోజు ఉదయం సీఎం హైదరాబాద్ తిరిగి వచ్చినప్పటికీ మిగిలిన మంత్రులు ఢిల్లీలో మకాం వేసిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఐదుగురు మంత్రులు హైదరాబాద్‌కు తిరిగివచ్చిన తర్వాత మీనాక్షి పాదయాత్ర పర్యటన షెడ్యూల్ వెలువడటం, దీనిపై సీఎంకు ముందస్తుగా ఎలాంటి సంకేతాలు లేకపోవడం గమనార్హమని అంటున్నారు. నిజానికి ఆమె పాదయాత్రతో పెద్దగా ప్రయోజనం కూడా ఉండదని, రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆమెను గుర్తుపట్టరని, ఒక వేళ గుర్తుపట్టినా ఆమె ముఖం చూసి రాష్ట్ర ప్రజలెందుకు ఓట్లు వేస్తారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తున్నది.
అన్యూహ్య నిర్ణయం వెనుక అసలైన డ్రామా..
అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకునే ముందు ఆడుతున్న డ్రామాగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏదైనా నిర్ణయాలు తీసుకోబో యే ముందు భారీ కసరత్తు చేసినట్టు నటిస్తుందని, ఇప్పుడు తెలంగాణలో అటువం టి అనుభవాలే ఎదురవుతున్నాయని చెప్తున్నారు. మొదట్లో రాష్ట్ర మంత్రుల అవినీతి మీద ఆధారాలు సేకరించి సీఎం అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారనే ఆరోపణలున్నాయి. తరువాత కాలంలో మంత్రులు, దిగువ శ్రేణి నేతలు సీఎం మీద ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారు. కేవలం ఫిర్యాదుల ఆధారంగానే కాకుండా.. ఫలితాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పేందుకే పాదయాత్ర డ్రామాకు తెరతీసినట్టు కనిపిస్తున్నదని పరిశీలకులు చెప్తున్నారు. ఓ వైపు సీఎం కుటుంబం మీద విమర్శలు, మరోవైపు పార్టీ రెండుగా చీలిపోయిందని అసలు కాంగ్రెస్ నాయకులను రేవంత్ పక్కన పెడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ఈ గ్యాప్ ఏ స్థాయిలో ఉన్నది? ఎంతమేరకు ఉన్నది? అని తెలుసుకోవడ మే పాదయాత్ర ఉద్దేశం కూడా కావచ్చని అంచనా వేస్తున్నారు. మీనాక్షి మొదటి నుంచీ క్షేత్రస్థాయిలో నేరుగా సమాచారం తీసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారని, ఇప్పుడూ రేవంత్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న అభిప్రాయాల నేపథ్యంలో అసలు విషయాన్ని గ్రహించడానికే ఆమె ఫీల్డ్ విజిట్‌కు దిగారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎటుతిరిగి ఎటు టర్న్ తీసుకుంటుందోనని కాంగ్రెస్ ముఖ్యులు, పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.