గద్వాల, ఆగస్టు 28 : సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆత్మగౌరవవాన్ని చంపుకోలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ప్రకటించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేశవ్ మాట్లాడారు. గద్వాలలో బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ అధినాయకులు పట్టించుకోకపోవడం వల్లే పార్టీ మారాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడా లేక ఇతర ఏ పార్టీలో ఉన్నాడో వచ్చే నెల కేటీఆర్ గద్వాల పరట్యనలో తెలుస్తుందని కేశవ్ తెలిపారు. ప్రస్తుతం తనతోపాటు నలుగురు మాజీ కౌన్సిలర్లు రాజీనామా చేసినట్టు చెప్పారు. కేటీఆర్ పర్యటనలో గద్వాల నియోజకవర్గం నుంచి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
పార్టీలో చేరే విషయంలో గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేవశ్ హైదరబాద్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీలో చేరడానికి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేశవ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు రాజీ నామా చేసిన అనంతరం గురువారం గద్వాలలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతునాయుడిని తన నివాసంలో కేశవ్ మర్యాద పూర్వకంగా కలిశారు.