హైదరాబాద్, జూలై30 (నమస్తే తెలంగాణ): కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ మేధావులు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను రాహుల్‌గాంధీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో మంగళవారం నిర్వహించిన బీసీ కుల సంఘాలు, రాజకీయ నాయకుల విసృ్తత సమావేశంలో వక్తలు మాట్లాడుతూ బీసీ కులగణనకు జీవో ఇచ్చి 5 నెలలైనా గణన మొద లు పెట్టలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. లేకుంటే బీసీలంతా ఏకమై గ్రామస్థాయి నుంచి పోరాటాలు చేస్తామని, ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో 90 శాతానికి పైగా వెనుకబడిన వర్గాలున్నాయని, కానీ రాజ్యాధికారంలో వారి స్థానం ఎక్కడ ఉన్నదని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు. 75 ఏండ్లలో జరగాల్సిన న్యాయం జరగలేదని, రావాల్సిన వాటా రాలేదని చెప్పారు. ఉద్యమాల ద్వారానే ఎన్నో సాధించుకున్నామని, హక్కులను కూడా అదే తరహాలో సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
కులగణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అభిప్రాయపడ్డారు. మొదటి నుంచీ బీసీలు వెనుకబాటుకు గురవుతూ వస్తున్నార ని వాపోయారు.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత వారిని విస్మరిస్తున్నారని మాజీ ఎంపీ వీ హన్మంతరావు మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరుగడం లేదని, రాహుల్, రేవంత్ ఇచ్చిన హామీ లు అమలు చేయాలని, లేకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. త్వరలోనే రాహుల్, సోనియా, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఇక్కడ కులగణన చేయాలని కోరుతానని చెప్పారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాజకీయంగా ఎన్ని దూరాలున్నా బీసీల ప్రయోజనం విషయం లో తాను ఎప్పుడూ బీసీల పక్షానే నిలుస్తానని చెప్పారు. తనకు సీఎం రేవంత్‌రెడ్డి కావాల్నా, బీసీలు కావాల్నా అని అడిగితే బీసీలే కావాలంటానని స్పష్టంచేశారు. మంత్రి పదవి కూడా అక్కరలేదని, బీసీలే ముఖ్యమని చెప్పా రు. ఇటీవల కులగణనపై సెక్రటేరియట్లో సమావేశానికి తనను పిలిచారని, అప్పుడు మాజీ మంత్రి జానారెడ్డి బీసీల 42 శాతాన్ని స్కిప్ చేద్దామని సలహా ఇస్తే తాను జోక్యం చేసుకొని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజీ 16, పేరా 1లో ఇచ్చిన హామీని గుర్తుచేశానని చెప్పారు. సీఎంను కలిసిన అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్‌లో ఒక్కరూ బీసీలు లేరని చెప్పగా తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పారని అంటే బీసీలకు ఇచ్చే ఉద్దేశం లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, బీసీ బడి వ్యవస్థాపకుడు చామకూర రాజు, కేవీ గౌడ్, ప్రొఫెసర్లు పీఎల్ విశ్వేశర్రావు, సింహాద్రి, ఇనుగంటి తిరుమలి, ప్రభంజన్ యాదవ్, చెరుకు సుధాకర్, పూల రవీందర్, వినయ్‌కుమార్, ఆకుల లలిత, బీఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు.