హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ)/ కవాడిగూడ : ఆర్ఎంపీలు, పీఎంపీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వారికి శిక్షణ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మరిచిపోయిందని ధ్వజమెత్తారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద ఆర్ఎంపీలు, పీఎంపీలు నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ప్రజలు వాళ్ల హామీలు నమ్మడం లేదని ఏకంగా బాండ్ పేపర్లమీద రాసిచ్చిండ్రు. ఆఖరికి రాహుల్‌గాంధీతో సోనియాగాంధీతో కూడా చెప్పించిండ్రు. ఆ హామీలేవీ అమలు కావడంలేదు.’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీలపై ఎలాంటి దాడులు చేసిన, కేసులు పెట్టిన దాఖలాల్లేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు కేసుల భయంతో బతుకుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కండ్లు తెరిచి ఆర్ఎంపీలు, పీఎంపీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ స్థాయి వైద్యులను వేధించకుండా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆర్ఎంపీలు, పీఎంపీల ట్రైనింగ్ కోసం జీవో ఇచ్చిండు. ట్రైనింగ్ ప్రారంభించే తరుణంలో కొంతమంది కావాలని అడ్డుకొని కోర్టు నుంచి స్టే తెచ్చిండ్రు. నేను కూడా ట్రైనింగ్ నిర్వహించేం-దుకు ఆదేశాలిస్తే దాన్ని ఆపేసేలా చేసిండ్రు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు కూడా మిమ్మల్ని ఇబ్బందిపెట్టలేదు. ఆర్-ఎంపీలు, పీఎంపీలు తమ సమస్యలను సంఘనాయకుల ద్వారా మాకు చెప్తే అర్ధగంటలో పరిష్కరించినం’ అని హరీశ్ గుర్తుచేశారు.
ఈ ప్రభుత్వంలో గ్రామీణ స్థాయి వైద్యులు ఏ రాత్రి ఎవరొస్తరో? ఏం కేసులు పెడుతరోనని భయంతో బతుకుతున్నరు. వాళ్లమీద కేసులు పెట్టి వైద్యులను బతుకుదెరువుకు దూరం చేస్తున్నరు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇస్తమని చెప్పిండ్రు. దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు?
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరి బతుకులు రోడ్డున పడ్డయి. గీత కార్మికుల పొట్టకొట్టి అక్రమ కేసులు పెడుతున్నరు. రైతులు, నేత కార్మి-కులు, ఆటో డ్రైవర్లు, చివరకు బిల్డర్లు సైతం ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.’ అని హరీశ్ మండిపడ్డారు. ‘రైతు రుణమాఫీ మీద ఏ ఊరికైనా పోదాం చర్చిద్దాం. ఇవ్వాల్సింది రూ.45 వేల కోట్లయితే, ఇస్తామన్నది రూ.31 వేల కోట్లు, ఇచ్చామని చెప్తున్నది రూ.21 వేల కోట్లు, ఇచ్చింది మాత్రం సుమారు రూ.15 వేల కోట్లే. ఆ సొమ్ము కూడా వానకాలంలో రూ.8 వేల కోట్ల రైతు బంధు, రెండు నెలల రూ.2 వేలకోట్ల పింఛన్ సొమ్ము, కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ చీరెలకు ఖర్చు చేసే రూ. వెయ్యి కోట్లు, గత ప్రభుత్వంలో న్యూట్రిషన్, కేసీఆర్ కిట్ల పథకాలకు చెందిన రూ.2 వేల కోట్లు, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాల-ర్షిప్ ఎగ్గొట్టి రైతు రుణమాఫీ ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి 11 సార్లు డిల్లీకి పోయినా రాహుల్‌గాంధీ మాత్రం అపాయిమెంట్ ఇవ్వడం లేదని హరీశ్ తెలిపారు. ‘రేవంత్‌రెడ్డి గాల్లో తిరుగుతున్నడు. ప్రజాస్వామ్యంలో ఓటే బలం. వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరం ఒక్కటిగా నిలబడి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి’ అని పిలుపునిచ్చారు. ఆర్ఎంపీలు, పీఎంపీల సమస్యలపై తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ధర్నాలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్ఎంపీలు, పీఎంపీలు పాల్గొన్నారు.