Harish Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చింది ఏముంది.. చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలు ఎవరు వచ్చినా ప్రతి రోజు సీఎం కలుస్తడు అంటడు అని.. 15 నెలలు అయినా ఎవరికీ కలువలేదన్నారు. కోడంగల్ వాళ్లను కూడా రానివ్వని పరిస్థితి నెలకొందన్నారు. మీ సత్తా చూపే సమయం వచ్చిందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కలిసి ఉండాలని.. విడిపోయి ఉండొద్దన్నారు. అప్పుడే బలం ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణం కట్టుకోవాలని.. రేవంత్ రెడ్డి గాల్లో ఉన్నడని.. గాలి మోటర్లు, విమానాల్లో తిరుగుతున్నన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే బలమని.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి, ప్రశ్నిస్తా నిలదీస్తానన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారి మీద వెంటనే విడుదల చేయాలని.. అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటదన్నారు. ఓట్లప్పుడు ఎన్నో మాటలు చెప్పిండని.. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నాడని మండిపడ్డారు. అడిగితే ఉల్టా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నడని.. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు.
30 పర్సెంట్ గవర్నమెంట్ అని ఎమ్మెల్యేలు చెబుతున్నారని.. ఏ పని కావాలన్నా 30శాతం కమిషన్ కావాల్సిందేనన్నారు. పోలీసు వాళ్లకు జీతాలు రావడం లేదని.. ఆరోగ్య భద్రత పని చేస్తలేదని విమర్శించారు. పోలీసులు, ఆటో డ్రైవర్లు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందని.. ఉద్యోగస్తులకు డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ అయిన వారికి బెన్ఫిట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మాటల గారడీ, అంకెల గారడీ అని అందరికి అర్థం అయ్యిందదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదామని చూస్తున్నరన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ప్రచారం చేసిండు. 80 స్థానాల్లో 77కి డిపాజిట్లు గల్లంతయ్యాయని విమర్శించారు. ఇక్కడ పని చేసి వేరే రాష్ట్రాల్లో వెళ్లి ప్రచారం చేసుకోవాలని.. తెలంగాణలో ఏ ఊళ్లకు పోయినా నీ పాలన గురించి చెబుతారు రేవంత్ రెడ్డి అంటూ చురకలంటించారు.
కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉపన్యాసాలు దంచడం కాదు.. గల్లీకి పోదాం రా రేవంత్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు. వడ్ల బోనస్ పైసలు ఇప్పటికీ వేయలేదు. 440 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. మన నెత్తి కొట్టి మనకు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగ చేసిందేం లేదన్నారు. ఒకే ఏడాదిలో లక్షా 47వేల కోట్ల అప్పు చేసిండని.. ఒక ప్రాజెక్టు కట్టింది లేదు.. ఓ కాళేశ్వరం కట్టింది లేదు.. చెరువు చెక్ డ్యాం నిర్మించింది లేదన్నారు. రేవంత్ ఒకే ఏడాదిలో రూ.1.47లక్షల కోట్లు అప్పు చేశాడని విమర్శించారు.
ఒక్క రూపాయి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని.. మహిళలను కోటీశ్వరులను చేస్తానని పైసా ఇవ్వలేదన్నారు. ఎవరూ ధైర్యం కోల్పోవద్దని.. కష్టం వస్తే పోరాడాలని.. సమస్యను పరిష్కారం చేసుకోవాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు 20ఏండ్ల క్రితం ప్రభుత్వ జాగాలో, ప్రభుత్వ పైసలతో భవనాలు కట్టించి, మీ ఆత్మగౌరవం కాపాడామన్నారు. అసెంబ్లీలో నేను, బయట మీరు పోరాటం చేయండి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలన్నారు. ఓట్ల రూపంలో కర్రు కాల్చివాత పెట్టాలన్నారు. ప్రజలు ఎంత కోపంగా ఉన్నరో తెల్వాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వైద్యారోగ్య మంత్రి వద్దకు తీసుకువెళ్లి మీ సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు.