హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న రెండు పరిణామాలు అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా ఏ పార్టీ అయినా పోలింగ్ ముగిశాక ఓటింగ్ సరళి, పార్టీ విజయావకాశాలను సమీక్షించుకుంటాయి. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం తన ఇంట్లో పార్టీ ముఖ్య నాయకులతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకాలేదు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వగ్రామం ధన్వాడకు వెళ్లి ఆయనతో భేటీ కావడం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేరళ వెళ్లడం చర్చకు కారణమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించాలని భావించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై సమీక్షించుకోవాల్సిన మంత్రులు అదేమీ పట్టించుకోకుండా ఎవరికి వారు తలో దారిన వెళ్లడం పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అంత సీరియస్‌గా తీసుకోలేదని చెప్తున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్‌ను తన భార్య నందినికి ఇప్పించుకునేందుకు చివరివరకు ప్రయత్నించి ఆయన భంగపడ్డారు. ఇది ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మొక్కుబడిగా పాల్గొన్నారు. సొంత జిల్లా ఖమ్మంలో ఎన్నికల ప్రచారాన్ని గాలికి వదిలేసి కేరళ, ఒడిశా వెళ్లి అక్కడ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అయితే ఖమ్మం ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని అసలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే పార్టీ అభ్యర్థి రామసహాయం రఘరాంరెడ్డి ప్రచారాన్ని తన భుజాలపై వేసుకొని ప్రచారం చేశారు. తమను కాదని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన వియ్యంకుడు రామిరెడ్డికి ఖమ్మం టికెట్ ఇప్పించుకోవడంతో గెలిపించుకునే బాధ్యత కూడా మీదేనని భట్టి, తుమ్మల చేతులు ఎత్తేశారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), ఆదినారాయణ (అశ్వారావుపేట), విజయబాబు తదితర ముఖ్యనేతలతో కలిసి పొంగులేటి కేరళ టూర్ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రేపో, మాపో వెళ్లి మంత్రి పొంగులేటితో టూర్లో జాయిన్ కానున్నట్టు సమాచారం. పొంగులేటి ఏ పార్టీలో ఉన్నా గ్రూప్‌లు నిర్వహిస్తారని.. వైసీపీ, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సొంత గ్రూపు ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అదేపని చేస్తున్నారని ఖమ్మం నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లాలో భట్టి విక్రమార్కను కాదని తన ఆధిపత్యం పెంచుకునేందుకు ఎమ్మెల్యేలు అందరినీ పొంగులేటి కూడుగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ సర్కారు ఎంతోకాలం ఉండదని బీజేపీ నాయకులు కూడా బాహాటంగానే చెప్తున్నారు. సీఎం సీట్లో నుంచి రేవంత్‌రెడ్డిని దించేందుకు ఖమ్మం, నల్లగొండ నాయకులు కాచుక్కూర్చున్నారన్న చర్చ కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పొంగులేటి తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో టూర్‌కు వెళ్లడం జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నది. పొంగులేటి వర్గం అలాంటిదేమీ లేదని, ఈ టూర్‌కు రాజకీయ ప్రాధాన్యమూ లేదని తేల్చి చెప్తున్నారు. టూర్ విషయమై సీఎంకు పొంగులేటి సమాచారమిచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతున్నట్టు రేవంత్ స్వయంగా పలు సభల్లో ఆరోపించారు. ఈ కుట్రలు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నవా? లేక కేంద్రంలోని బీజేపీ సహకారంతో జరుగుతున్నాయా? అనే చర్చకు దారితీసింది. అసలు రేవంతే కాంగ్రెస్‌లో ఏక్నాథ్షిండేగా మారి బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి బాహాటంగానే స్టేట్మెంట్ ఇవ్వగా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీలోకి రావడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పొంగులేటి టూర్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తన ప్రభుత్వానికి ఖమ్మం, నల్లగొండ మంత్రుల నుంచే ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో రేవంత్ ఈ రెండు జిల్లాల పార్టీ కీలక నేతలపై నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీ ముఖ్యనేతలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను సీఎం ట్యాప్ చేయిస్తున్నారేమోనని బీజేపీ నాయకుడు రఘునందన్‌రావు ఇటీవల ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ ఎన్నికలపై పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ డుమ్మాకొట్టడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.