Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లను పొగపెట్టి గొడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో నామరూపాలు లేకుండాపోయిన టీడీపీ పాత నేతలను ఏరికోరి పార్టీలో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీలోనే ఉన్న రేవంత్ ఆ తరువాత కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన పాత మిత్రులను ఒక్కొక్కరిని కాంగ్రెస్‌లో చేర్చడం ద్వారా తన వర్గాన్ని పెంచుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ మాజీ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి తదితర నేతలను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తూ వారి ఇండ్ల చుట్టూ రేవంత్ తిరగడాన్ని కాంగ్రెస్ నేతలు ఎత్తిచూపుతున్నారు.. మండవ వెంకటేశ్వరరావుకు నిజామాబాద్ రూరల్ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి పీసీసీ అధ్యక్షునిపై మండిపడుతున్నారు.
రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పాలకుర్తి టికెట్‌పై హామీ ఇవ్వడంతో ఆయన కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థానాన్ని ఆశిస్తున్న కొండా మురళి రేవంత్ తీరును తూర్పారబడుతున్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇప్పటికే నర్సంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం కొద్దిరోజులుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టులో నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఆయన పరకాల స్థానమైనా సరే అని భావిస్తున్నట్టు సమాచారం.