KVP Ramachandra Rao | హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సై అంటే సై అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు! శుక్రవారం ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు, సుతిమెత్తని హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తాను సీనియర్‌ను అని చాటుతూ, రేవంత్ తనకంటే జూనియర్ అని ఎత్తిపొడిచారు. కాంగ్రెస్ పట్ల తన నిబద్ధతను శంకిస్తున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. ఆ మాటకొస్తే.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు రేవంత్‌రెడ్డి బ్రెయిన్‌చైల్డ్ కాదని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ఆ ఆలోచన రూపుదిద్దుకున్నదని చెప్పుకొచ్చారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధామ్యాలను గుర్తెరగకుండా అప్పులు చేస్తున్నదని దెప్పిపొడిచారు. కంటోన్మెంట్లో గురువారం నిర్వహించిన డిజిటల్ ఫ్యామిలీ కార్డుల పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ కూల్చివేతలు, హైడ్రాపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఉస్మాన్‌సాగర్‌లో అక్రమంగా ఫాంహౌజ్‌లను నిర్మించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేరును కూడా రేవంత్‌రెడ్డి ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని, పాలనాపరమైన విధానాలను పరోక్షంగా ఎత్తిచూపిన ఆ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘ప్రస్తుత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక గుల్బర్గా ప్రాంతంలో పార్టీ ప్రముఖ నాయకుడిగా ఉన్న సమయంలో దాదాపు 1970లోనే కాంగ్రెస్ పార్టీతో నా ప్రస్థానం ప్రారంభించాను’ అని కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు. తద్వారా పార్టీలో రేవంత్‌రెడ్డి తనకంటే చిన్నవాడని, చాలా తక్కువని అని చూపించే ప్రయత్నం చేశారు.
‘కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని, పథకాన్ని త్రికరణశుద్ధిగా సమర్థిస్తాను. చిత్తశుద్ధితో అమలుచేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను అని ఈరోజు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదు’ అని పేర్కొనడం ద్వారా తన నిబద్ధతను రేవంత్‌రెడ్డి గుర్తించడం లేదనే విషయాన్ని కేవీపీ ఎత్తిచూపారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కాంగ్రెస్‌కు అత్యంత ఇష్టమైన ప్రాజెక్ట్ అని, 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి నిలిపారని పేర్కొనడం ద్వారా అది రేవంత్‌రెడ్డి బ్రెయిన్‌చైల్డ్ ప్రాజెక్టు కాదని, తన మిత్రుడు వైఎస్సే దానికి బీజం వేశారని పరోక్షంగా చెప్పు కొచ్చారు. 2005లోనే సేవ్ మూసీ పథకాన్ని రూ.908 కోట్ల అంచనాతో వైఎస్ ప్రారంభించారని, అయితే నాడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చి, రాష్ర్టాన్ని అప్పుల పాలు చేయొద్దనే ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేపట్టలేదని లేఖలో పేర్కొనడం ద్వారా.. నేడు రేవంత్ సర్కార్ సంక్షేమాన్ని విస్మరించి, మూసీని తలకెత్తుకొని, రాష్ట్రంపై అప్పుల భారం మోపుతున్నదనే రీతిలో మాట్లాడారు.
మూసీ ప్రక్షాళన వల్ల నష్టపోయే ప్రతి పేద, మధ్య తరగతివారికి సంతృప్తికరమైన పునరావాసం కల్పించి, మూసీకి పూర్వస్థితి కల్పించాలంటే, అధిక మొత్తంలో నిధులు అవసరమని గ్రహించి, ఆ పథకాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయిందని కేవీపీ పేర్కొన్నారు. తద్వారా రేవంత్‌రెడ్డికి వాటిపై ఏమాత్రం అవగాహన, సరైన ప్రణాళిక లేదనే అర్థం వచ్చే రీతిలో పదాలను దట్టించడం గమనార్హం.
లేఖలో ప్రస్తావించిన, లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే, సీఎం రేవంత్‌రెడ్డికి కేవీపీ నేరుగానే సవాల్ విసిరినట్టు అర్థమవుతున్నది. తన ఫాంహౌజ్‌పై ఆరోపణలు వచ్చినరోజే సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశానని గుర్తుచేస్తూ, ఇప్పటికైనా వెంటనే అధికారులను తన ఫాంహౌజ్‌కు పంపించాలని కోరారు. మార్కింగ్ ప్రక్రియ పార్శదర్శకంగా కొనసాగాలని, మార్కింగ్ చేసే సమయం, తేదీ తనకు ముందే తెలియజేయాలని సూచించారు. తద్వారా ప్రస్తుత ప్రక్రియ పారదర్శకంగా లేదని చెప్పకనే చెప్పారు.
‘పల్లంరాజు’ వ్యవహారంలా కాకుండా తనకు ముందే తేదీ చెప్పాలని పరోక్షంగా హెచ్చరించారు. ‘మీరు, నేను కలుగజేసుకోకుండా, చట్టాన్ని తన పని తాను చేసుకొని పోనిద్దాం’ అని కేవీపీ పేర్కొనడం ద్వారా రేవంత్ తనను టార్గెట్ చేస్తున్నారనే సందేశం పంపారు. ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకోకుండా ఉంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందని సలహా ఇచ్చారు.
ఈ లేఖలో ‘నేను కాంగ్రెస్ కార్యకర్తను.. నా నరనరాన కాంగ్రెస్ రక్తం ఉన్నది.. అనేక ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నాను.. కాంగ్రెస్‌కు నష్టం జరిగే పని చేయను.. అంతరాత్మ.. నా తుది ఊపిరి వరకూ..’ అని పదే పదే వ్యక్తీకరించడం ద్వారా తాను రేవంత్ కన్నా ఎక్కువ విధేయుడైన కాంగ్రెస్ వాదినని కేవీపీ ఘంటాబజాయించారు.
మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్‌రెడ్డి పరిగణనలోనికి తీసుకోవడం లేదన్న విషయాన్ని కేవీపీ ఈ లేఖ ద్వారా బహిర్గతం చేశారు. ‘పార్టీ శ్రేయోభిలాషులు మూసీ ప్రక్షాళనను మొదటి దశలోనూ, సుందరీకరణను రెండో దశలోనూ చేపడితే బాగుంటుందని మీకు సూచించవవలసినదిగా నన్ను కోరినా.. మూసీ సుందరీకరణపై మీ ఆసక్తిని గమనించి, మీ ఆలోచన, విజన్, సమర్థతపై నమ్మకంతో.. ఆ విషయం మీ దృష్టికి తేలేదు. పేదలకు నష్టం కలుగకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా స్వాగతిస్తాను’ అని పేర్కొన్నారు.
రేవంత్ వ్యవహార శైలి వల్ల పేదలకు నష్టం కలుగుతున్నదని పరోక్షంగా ఎత్తిచూపారు. ‘అజీజ్‌నగర్‌లోని నా కుటుంబసభ్యుల పేరు మీదున్న ఫాంహౌజ్‌పై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అది క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నేతగా తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నది’ అని కేవీపీ పేర్కొన్నారు. నిజానికి కేవీపీ పేరును ప్రతిపక్షాలు ఎప్పుడు మరిచిపోయాయి. ఈ అంశాన్ని లేవనెత్తింది రేవంత్‌రెడ్డే! ప్రతిపక్షాలు అంటూ రేవంత్ తీరును, ఆయన క్రమశిక్షణను కేవీపీ ప్రశ్నించారు.