హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ): విభజన సమస్యల పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది రాష్ర్టానికి ఏ మాత్రం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతంతో తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేతిలో చంద్రబాబు పావుగా మారిపోయారని, ఆ పార్టీ డైరెక్షన్లోనే అడుగులు వేస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యల పేరుతో సమావేశాలు, హైదరాబాద్‌లో భారీ ర్యాలీ ఇవన్నీ అందులో భాగమేనని పేర్కొన్నారు. చంద్రబాబును అడ్డుపెట్టుకొని తెలంగాణను కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ కలిసి ఏపీలో అమలుచేసిన పొలిటికల్ గేమ్‌ను తెలంగాణలో మొదలుపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
దీనిపై కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉన్నదని చెప్పారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్ వచ్చి పోయే విషయం ఎవరికీ తెలిసేదికాదని, ఇప్పుడు ర్యాలీలు, సమావేశాల పేరుతో హల్చల్ చేస్తున్నారని అన్నారు. పలు అంశాల్లో చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సమర్ధించారని, అంటే ఇవన్నీ బీజేపీ లైన్లోనే నడుస్తున్నాయని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో వచ్చిన సీట్లే బీజేపీకి అధికారం తెచ్చి పెట్టాయని, లేకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేదని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యేవారని పేర్కొన్నారు.