జడ్చర్ల టౌన్, అక్టోబర్ 29: జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో జడ్చర్ల అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆ తర్వాత పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మూడు పర్యాయాలు జడ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన బీసీ సామాజికవర్గానికి చెందిన కీలక నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్లో చేరడంతో ‘గులాబీ’కి మరింత బలం చేకూరింది. ఎర్రశేఖర్ బీఆర్ఎస్లో చేరడంతో ఆయన అనుచరులు, అభిమానులు జడ్చర్లలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.