హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : అత్యంత వెనకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, స్వయం ఉపాధికి రుణాలను అందిస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరిస్తున్నది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు సంగతి అటుంచితే ఉన్నవాటిని నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ప్రస్తుతం మొదలుపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో కార్పొరేషన్ల ఉనికే ప్రశ్నార్థకంగా మారనున్నది. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై 10 లక్షల వరకు రుణ సదుపాయం ఉండగా, ఆ పరిమితిని రూ.4 లక్షలకే పరిమితం చేసి ద్రోహం తలపెట్టింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు, చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పలు హామీలిచ్చింది. ఎస్సీ వర్గాల్లో మాల, మాదిగలతోపాటు మిగిలిన 57 షెడ్యూల్డ్ కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.750 కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఎస్టీలకు సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చింది. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి యువతకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా, వడ్డీలేని రుణాలందిస్తామని వాగ్దానం చేసింది.
ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరుక (పురగరి క్షత్రియ), లింగాయత్, మేర, గంగపుత్ర, ఆర్యవైశ్య, రెడ్డి, ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడా, ఏకలవ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ కార్పొరేషన్‌గా వేరు చేయాలని ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నది. ఇక 57 షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఏర్పాటుపై ఇప్పటికీ ఊసెత్తడం లేదు. అంతేగాక బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర), వాల్మీకి బోయ, కృష్ణ బలిజ, భట్రాజ్, కుమ్మరి ఫెడరేషన్లను సైతం కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించి ఇప్పటికీ ఉత్తర్వులివ్వలేదు. పేరుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా చైర్మన్లను ఇంకా నియమించలేదు.
రాజీవ్ యువ వికాసం పథకం పేరిట ఆయా సామాజికవర్గాలకు కాంగ్రెస్ సర్కారు మరో నమ్మకద్రోహాన్ని తలపెట్టింది. ఎస్టీలకు సంబంధించి ట్రైకార్ సంస్థ దశాబ్దాలుగా రుణాలందిస్తూ వస్తున్నది. సంస్థ అందించే సబ్సిడీ రుణం యూనిట్ కాస్ట్ రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉండేది. ఎస్సీ కార్పొరేషన్ కూడా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు అందించేది. బీసీ కార్పొరేషన్ గరిష్ఠంగా 5 లక్షలు, అంతకు మించి కూడా సబ్సిడీ రుణం అందించే వెసులుబాటు ఉండేది. ఈ రుణాలు యువతకు, ఆయా సామాజికవర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేవి. కాంగ్రెస్ సర్కారు రాజీవ్ యువ వికాసం పేరిట సబ్సిడీ రుణాన్ని పూర్తిగా కుదించింది. ఈ పథకం ద్వారా గరిష్ఠంగా అందించే సబ్సిడీ రుణం రూ.4 లక్షలే. అందులోనూ లబ్ధిదారుకు అందించేందుకు రూ.2.8 లక్షలే. మిగతా రూ.1.2 లక్షలను బ్యాంకు రుణంగానే ఇవ్వనుండడం గమనార్హం.
ఇప్పుడు కొత్తగా రాజీవ్ యువవికాసం పథకం పేరిట కార్పొరేషన్ల ఉనికినే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. ఆయా సామాజికవర్గాలకు వేర్వేరుగా కాకుండా అన్ని కులాల కార్పొరేషన్లకు ఈ పథకం కింద సబ్సిడీ రుణాలిచ్చేందుకు సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ తదితర వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో ఇప్పటికే దశాబ్దాలుగా సేవలందిస్తున్న, ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఆయా కులాల కార్పొరేషన్లు ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కూడా కార్పొరేషన్లకు సంబంధించిన విధివిధానాలపై ఎక్కడా స్పష్టతనివ్వడం లేదు.