హైదరాబాద్, జులై 9(నమస్తే తెలంగాణ): రైతుభరోసాకు విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలవారీగా సదస్సులు నిర్వహించి, రైతుల అభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయించింది. బుధవారం నుంచి ప్రారంభం ప్రారంభం కానున్న ఈ సదస్సులు ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు రైతుభరోసాపై సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ప్రణాళిక రూపొందించింది. వాస్తవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ నెల 15లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉన్నది. కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చించి, విధి విధానాలు ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 23 వరకు జిల్లాలవారీ సదస్సులకు షెడ్యూల్ నిర్ణయించడంతో ఈ నెల 15లో క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం కనిపించడం లేదు. దీంతో వానకాలం రైతుభరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం పంపిణీ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. కనీసం కోతల సమయానికైనా పెట్టుబడి సాయం అందుతుందా? లేదా? అనే సందేహం కలుగుతున్నది. కమిటీలు, సదస్సులు, చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.
రైతుభరోసా నిబంధనలపై రైతులతో చర్చించడంతోపాటు అసెంబ్లీలోనూ చర్చకు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు పలుమార్లు వెల్లడించారు. అయితే అసెంబ్లీలో రైతుభరోసాపై చర్చ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పార్లమెంట్లో ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఈ నెల 24 లేదా 25న రాష్ట్ర బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు 22 లేదా 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. కాగా, 23 వరకు సబ్ కమిటీ జిల్లాల్లో సదస్సులు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోనున్నది. రైతుల అభిప్రాయాలను క్రోడీకరించి కమిటీ నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. కమిటీ తన నివేదికను తయారు చేసేందుకు కనీసం నాలుగైదు రోజులు పడుతుంది. దానిని ప్రభుత్వానికి ఇవ్వడానికి వారమైనా పడుతుంది. ఆ లోపు అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అసలు రైతుభరోసా అంశం అసెంబ్లీలో చర్చకు వస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రైతుభరోసా ఎవరికి ఇస్తారో, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారో, ఎంత మంది రైతులకు, ఎంత మొత్తం ఇస్తారో అనే అంశాలపై స్పష్టత రాలేదు. తద్వారా అసలు రైతుభరోసాకు ఎన్ని నిధులు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
రైతుభరోసా పంపిణీపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు రైతుభరోసాపై కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న మొదటగా ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ‘రైతునేస్తం’ పేరుతో సమావేశాలు నిర్వహించి రైతుభరోసా నిబంధనలపై రైతుల అభిప్రాయాలను తీసుకున్నది. ఈ కార్యక్రమంలో స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. పలు జిల్లాలో కలెక్టర్లు సైతం పాల్గొన్నారు. ఏఈవోలు సైతం రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఐదు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని కొందరు రైతులు, 10 ఎకరాల వరకు ఇవ్వాలని మరికొందరు రైతులు అభిప్రాయపడ్డారు. ఐటీ (ఆదాయపన్ను) చెల్లించే వారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని రైతులందరూ డిమాండ్ చేశారు. ఈ అభిప్రాయాలతో రైతుభరోసాలో ఎలాంటి నిబంధనలు పెట్టాలనే అంశంపై ప్రభుత్వానికి ఒక స్పష్టమైన నివేదిక కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సదస్సులు నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తున్నది.