కమలాపూర్, జనవరి 11 : తనను జైలులో పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్ రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్ విఫలమైనట్టు ఆరోపించారు.
ప్రజల కోసం కొట్లాడుతున్నందుకే తనపై కేసులు పెడుతున్నాడని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టంచేశారు. కేసీఆర్ పెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి తులం బంగారం కలిపి వందరోజుల్లో ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. 50 శాతం రుణమాఫీ కాలేదని, రైతు భరోసా ఆం క్షలు లేకుండా రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని హెచ్చరించారు.