కొల్లాపూర్/కోడేరు, మార్చి 1 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పేట్రేగిపోతున్నారు. బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. మొన్న చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్‌రెడ్డి హత్య నిన్న పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పరమేశ్ నాయుడిపై దాడి.. నేడు కోడేరు మండలం నార్యానాయక్ తండాలో ఏడుగురిపై హత్యాయత్నం.. ఇలా కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత సింగోటం ఆలయానికి విచ్చేయగా.. కోడేరు మండలం నార్యానాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాజునాయక్ ఆధ్వర్యంలో పలువురు వెళ్లి స్వాగతం పలికారు. విషయం తెలుసుకొన్న అదే గ్రామానికి పాండునాయక్తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు మనసులో పెట్టుకొని రాత్రికి రాజు ఇంటిపై దాడికి యత్నించారు.
దీంతో సదరు నేత భయంతో తలుపులు పెట్టుకొని 100కు డయల్ చేశాడు. తర్వాత రాజు తమ్ముడు రవి కోడేరు ఎస్సైకి ఫోన్‌చేసి విషయం చెప్పగా.. ‘నువ్వు ఫోన్ పెట్టకుంటే సినిమా చూపిస్తా’.. అంటూ బెదిరింపులకు దిగినట్టు రవి వాపోయాడు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ గూండాలు అక్కడికి నుంచి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మళ్లీ రాజు ఇంటిపై దాడి చేశారు. మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడగా.. రాజు కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. అయినా వదలకుండా పట్టుకొని గొడ్డళ్లు.. కత్తులతో దాడి చేశారు. రక్తాలు కారుతుండగానే రాజు కుటుంబ సభ్యులు కోడేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా.. అప్పటికే కార్లల్లో వచ్చి అక్కడ మాటు వేసిన పాండు అనుచరులు దవాఖాన ఎదుటే వీరిపై కత్తులతో మరోసారి దాడి చేశారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ప్రైవేటు దవాఖానకు తరలించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అండతోనే దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ శ్రేణులపై దాడులేనా మార్పంటే? ; కొల్లాపూర్‌లో కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీ మాజీ మంత్రి హరీశ్‌రావు
బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల దాడుల దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సూర్యానాయక్తండాలో బీఆర్ఎస్ నాయకులపై దాడిని ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. రాష్ట్రంలో రోజురోజుకూ హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు తెస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీ అమలవుతున్నదని మండిపడ్డారు. మంత్రి అనుచరులు దాడులకు దిగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం సరికాదని మండిపడ్డారు. ఎన్ని దాడులకు దిగినా, బీఆర్ఎస్ నేతలు ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటారని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ప్రజలే సమాధి చేస్తరు ; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ అధికార దౌర్జన్యాన్ని ప్రజలే సమాధి చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. నార్యనాయక్తండాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. సతాపూర్లో జరిగిన దాడిని మరవముందే కాంగ్రెస్ గూండాలు అడ్డూఅదుపూ లేకుండా పెట్రేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలు వరుస దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రజాపాలన అంటే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజల గొంతు వినిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడిచేయడమేనా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్ తరహా దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.