Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేసిన పాచిక పజీత పాలైందని పట్టభద్రులు మండిపడుతున్నారు. పార్టీకి లబ్ధిచేకూర్చుకొనే ప్రయత్నాలకు ఒడిగడుతూ తమను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ఇండియా టుడే -యాక్సిస్ మై ఇండియా సర్వే తేల్చినట్టు ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఈ స్థానం కోసం బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎవరెవరికి ఎంత పోలింగ్ నమోదవుతుందో చెప్తూ ఈ పోస్ట్ చక్కర్లు కొడుతున్నది. పోలింగ్‌కు ముందు ఎలాంటి సర్వేలు చేయకూడదని, ఒకవేళ చేసినా వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో అసలు సదరు సంస్థ సర్వే చేసిందా? అన్న అనుమానాలు సంబంధిత నియోజకవర్గాల అభ్యర్థుల్లో వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఇండియా టుడే-యాక్సెస్ మై ఇండియా సర్వే సంస్థ బాధ్యులను కాంగ్రెస్ సర్వే విషయంపై ప్రశ్నించారు. దీనికి సదరు సంస్థ బాధ్యుడు ‘అది ఫేక్’ అని క్రిశాంక్‌కు ఎక్స్ వేదికగా బదులిచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో అనుసరించిన తప్పుడు మార్గాలనే విద్యాధికులు ఓటర్లుగా ఉన్న పట్టభద్రుల నియోజకవర్గంలోనూ పాటిస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.