హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ నేతలు ఎన్నికల్ కోడ్‌ను ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు డబ్బు సంచులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల అరాచకాలపై ముందుగానే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని అయినా చర్యలు తీసుకోవడంలో ఈసీ విఫలమైందని విమర్శించారు.
పోలీసులు సైతం కాంగ్రెస్ నేతలకు సహకరించారని, ఆ పార్టీ ఏజెంట్లలా పనిచేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, శంకర్‌నాయక్, అమిత్‌రెడ్డి వంటి వారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని, వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఓటర్లను భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల తీరుపై 60కిపైగా ఫిర్యాదులను ఈమెయిల్ ద్వారా ఈసీకి పంపామని చెప్పారు. ప్రత్యక్షంగా కూడా ఈసీ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కే కిషోర్‌గౌడ్, సుమిత్రానంద్, అర్షద్ అలీఖాన్, ఆజం అలీ పాల్గొన్నారు.