నస్రుల్లాబాద్, నవంబర్ 21 : దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. పార్టీ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో గురువారం రోడ్డుపై బైఠాయించారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో సీనియర్ కార్యకర్తలు ఉన్నా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దుర్గం శ్యామలకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం అనుచరులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌ను తొలగించి.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ ప్రతిపాదించిన పార్టీ కార్యకర్తకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై నియోజకవర్గ సీనియర్ నాయకులు గురువారం అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. గాంధీభవన్‌కు వచ్చిన 8 మండలాల నేతలు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు.. 20 ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని ఎవరెవరికో నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదు అనంతరం గాంధీభవన్ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సౌదాగర్ అరవింద్, కమల్, వినోద్, సంగమేశ్వర్, ప్రదీప్, అన్ని మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.