BC Reservations | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని కేంద్రానికి పంపి, 9వ షెడ్యూల్డ్‌లో చేర్చాలనే సాకుతో కాంగ్రెస్ సర్కారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. చట్టం అమలును అటకెక్కించేందుకు సిద్ధమవుతున్నది. సర్కారు తీరుపై బీసీ మేధావులు, కులసంఘాల ప్రతినిధులు ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని సాకుగా చూపి చట్టం అమలును పక్కనపెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టులు, ఇతరత్ర నియామకాల్లో అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణన నిర్వహించి, బీసీల రిజర్వేషన్ శాతాన్ని 42శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్‌లోనూ పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కులగణనను కంటితుడుపుగానే చేపట్టింది. అడుగడుగునా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలోతొక్కింది. పూర్తిగా అశాస్త్రీయంగా, అనాలోచిత నిర్ణయాలతో ఇంటింటి సర్వేను మమ అనిపించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల) గణాంకాలే అందుకు అద్దం పడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు, సర్కారు గణాంకాలకు ఎక్కడా పొంతనలేదని, పూ ర్తిగా అసంబద్ధంగా ఉన్నాయని బీసీ మేధావులు, కులసంఘా ల నేతలే కాదు, స్వయంగా కాంగ్రెస్ ప్రతినిధులే ఆరోపణలకు దిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ సర్కారు మాత్రం రాష్ట్రంలో మొత్తంగా 3.70కోట్ల మంది జనాభా ఉండగా, అందులో బీసీలు 46.25%, బీసీ ముస్లింలు 10.08%, ఎస్సీలు 17. 43%, ఎస్టీలు 10.45%, ఓసీ ముస్లింలు 2.48%, ఇతర ఓసీలు 13. 31% ఉంటారని నివేదించింది. కానీ ఆయా క్యాటగిరీల్లో కులాలు, ఉపకులాలవారీగా లెక్కలను మాత్రం వెల్లడించలేదు. నివేదికలోని లోపాలను సవరించాలని డిమాండ్లు వెల్లువెత్తినా ఏమాత్రం ఖాతరు చేయకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ తరువాత నివేదిక ఆధారంగా రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. బీసీ కమిషన్ నివేదిక లేకుండానే, కేవలం డెడికేటెడ్ కమిషన్ నివేదికనే రెఫరెన్స్‌గా పెట్టింది. ఇప్పుడు ఆ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని బీసీ సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తుంటే, సర్కారు మాత్రం కేంద్రంపై నెపం మోపి చట్టాన్ని అటకెక్కించాలని చూస్తున్నది.
ఈ అంశాన్ని 9వ షెడ్యూల్డ్‌లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలంటూ కాంగ్రెస్ సర్కారు హైడ్రామాకు తెరతీసింది. 9వ షెడ్యూల్ అంశం అనేది ఇప్పుడు కొత్తగా వ చ్చింది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. వాస్తవంగా కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను కోర్టుల్లో ఎవరూ సవాల్ చేయకుండా, సమీక్షించకుండా ఉండేందు కు, వాటిని యథావిధిగా అమలు చేసేందుకు వీలుగా రాజ్యాంగం లో 9వ షెడ్యూల్డ్‌ను 1951లో మొదటి సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. 9వ షెడ్యూల్డ్‌లో పొందుపరచబడిన చట్టాలు, అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. కోర్టులో సవాలు చేయలేం. దేశంలోని భూ సంసరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు తదితర మొత్తంగా 284 చట్టాలు 9వ షెడ్యూల్డ్‌లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా తమిళనాడు ప్రభుత్వం 1993లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ నియామకాల్లో 69శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. అమలుకు అప్పటికప్పుడు జీవోలు జారీ చేసింది. ఉద్యోగాలు భర్తీ చేసింది. కాగా, కొందరు కోర్టుకు వెళ్లగా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కొట్టివేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్లి అక్కడే మకాం పెట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసింది. అనేక చట్టపరమైన సవాళ్లను ఎదురొన్న తర్వాత దానిని 9వ షెడ్యూల్డ్‌లో చేర్చి తమిళనాడు కల్పించిన రిజర్వేషన్లకు న్యాయసమీక్ష నుంచి రక్షణ కల్పించుకున్నది. 9వ షెడ్యూల్డ్‌లో చేర్చినంత మాత్రాన న్యాయసమీక్ష పరిధిలోకి రావని అనుకోవద్దని, అవసరమైతే వాటిని సైతం సమీక్షిస్తామని సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా ఇప్పటికే వెల్లడించింది.
తమిళనాడు సర్కారు సహేతుకమైన, శాస్త్రీయమైన గణాంకాలతో కేంద్రాన్ని ఒప్పించింది. న్యాయసవాళ్లను అధిగమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేరుకోసమే బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, స్థానికసంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందని వివరిస్తున్నారు. అమలు కోసం ఇప్పటివరకు జీవోలు విడుదల చేయకుండానే కేంద్రంపై నెపం నెట్టేందుకు పూనుకున్నదని తెలుపుతున్నారు. చట్టాలను అమలులోకి తీసుకురాకుండానే, ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండానే 9వ షెడ్యూల్డ్‌లో చేర్చాలంటూ
కోర్టుల బూచిగా చూపి, 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నది. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కాంగ్రెస్ అటకెక్కించాలని చూస్తున్నది. పేరుకే చట్టం చేసింది తప్ప, అమలు చేసేందుకు ఏ దశలోనూ చిత్తశుద్ధిని చూపడం లే దు. స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకూ కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేస్తాం. రేవంత్ సర్కార్ మోసపూరిత వైఖరిని బీసీ సమాజానికి తెలియజేస్తాం.
రిజర్వేషన్లు అమలు చేసే అవకాశమున్నా.. రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీసీ సంఘాల మేధావులు, కులసంఘాల నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెండు జీవోలు విడుదల చేయాలని, స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ నామినేటెడ్, కోర్టులు, ఇతరత్రా ప్రభుత్వసంస్థల్లో చేపట్టే నియామకాల్లో, కాంట్రాక్టు పనుల్లో 42% రిజర్వేషన్లు కల్పించి చిత్తశుద్ధిని చాటుకోవాలని తేల్చిచెబుతున్నారు. కేంద్రంపై నెపంమోపి, చట్టాలను అటకెక్కిస్తే ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.