హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ప్రేమ కాదు డ్రామా అని చెప్పడానికి ప్రభుత్వం విడుదలచేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తున్నది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులకు 25% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం.. తీరా అమల్లోకి వచ్చే సరికి మరోసారి మోసం చేసింది. గత పాలసీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 15% రిజర్వేషన్లకే గీత కార్మికులను పరిమితం చేసింది. ఈ మేరకు నూతన ఎక్సైజ్ పాలసీ విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ నెల 14వ తేదీనే జీవోను విడుదల చేసింది. కానీ, ఉత్తర్వుల కాపీ మీడియా కంట పడకుండా గోప్యంగా ఉంచింది.
డిక్లరేషన్‌లో చెప్పిందేమిటి..?
2023 నవంబర్ 10న బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్య కలిసి బీసీ డిక్లరేషన్‌ను విడుదలచేశారు. అందులో 17వ అంశం కింద గీత కార్మికులకు హామీలిచ్చింది. ఇందులో ‘ఈత చెట్ల పెంపకం కోసం ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమి& ఈత మొకలు, బిందు సేద్యం, కాంపౌండ్ వాల్ నిర్మాణాలపై 90% సబ్సిడీ… మద్యం దుకాణాల లైసెన్సుల్లో గీత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 15% రిజర్వేషన్ 25 శాతానికి పెంపు..’ అని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ మద్యం దుకాణాల్లో గౌడ సామాజికవర్గానికి 25% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ తీరని అన్యాయమే చేసిందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన గీత కార్మిక నేత వెంకటేశ్‌గౌడ్ విమర్శించారు.
నిట్టనిలువుగా ముంచి
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే కోర్టులు, చట్టాలు, బిల్లులు తదితర ప్రక్రియలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించారు. గవర్నర్ వాటిని ఆమోదించకుండానే కేంద్రానికి పంపినట్టు కాంగ్రెస్ నేతలే బయట చెప్తున్నారు. గవర్నర్ ఆమోదించని విషయాన్ని ఇప్పటివరకు ప్రజలకు చెప్పకుండా.. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆర్డినెన్స్ తెచ్చింది. దానికి కూడా ఆమోదం తెలపకుండానే గవర్నర్ కేంద్రానికి పంపించారు. ఆయా బిల్లులకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. అయితే, ఆ బిల్లుల విషయంలో ఇండియా కూటమి తీసుకున్న కార్యాచరణ ఏదీలేదని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ‘బీసీలకు 42% రిజర్వేషన్ల సంగతి పక్కనే పెడితే.. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 25% రిజర్వేషన్లు అమలు పూర్తిగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతిలోని పనే కదా? ఒక్క సంతకంతో అమలు చేయొచ్చు. గౌడ రిజర్వేషన్ల అమలుపై కనీస చర్చ పెట్టకపోవడానికి కారణం ఎవరు? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయింది? ఈ ఒక లాజిక్‌ను అర్థం చేసుకుంటే చాలు బీసీలకు 42% రిజర్వేషన్ల మీద సీఎం రేవంత్‌రెడ్డిది ప్రేమా? డ్రామా? అర్థం అయిపోతుంది’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
స్థానిక సమరం ఇప్పట్లో లేనట్టే..!
జిల్లాల వారీగా మద్యం దుకాణాల లైసెన్స్‌లకు సెప్టెంబర్ చివరి వారం లోపు నోటిఫికేషన్ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి సూచనప్రాయంగా ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పుడు కొనసాగుతున్న పాలసీకి సంబందించి, మద్యం దుకాణాల చివరి దశ రెంటల్స్ రావాల్సి ఉన్నది. ఈ డబ్బు పూర్తిగా వసూలైన తరువాతే నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం సూచించినట్టు సమాచారం. ఈ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సెప్టెంబర్ చివరి వారం వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అప్పుడు మద్యం టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాని సదరు అధికారి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చిందని, కానీ, జంతర్ మంతర్ ధర్నాలు, 23న పీఏసీ సమావేశాలు ప్రజలను మభ్యపెట్టేందుకేనని బీసీ సంఘం నాయకులు అంటున్నారు.