హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రేపటి తెలంగాణ జీవధార అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసమే ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని, రైతాంగం ప్రయోజనాలను బలిపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా ప్రాజెక్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు శ్రీధర్‌రావు దేశ్‌పాండే రచించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు : ప్రశ్నలు-విమర్శలు -వక్రీకరణలు-వివరణలు’ ‘సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో కొనసాగింది. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వక్రీకరణలను, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగాన్ని దెబ్బతీసిన విధానాలను ఈ సందర్భంగా హరీశ్‌రావు తీవ్రంగా ఎండగట్టారు. కేసీఆర్ నేతృత్వంలోని పదేండ్ల బీఆర్ఎస్ పాలనంలో తెలంగాణ సాగునీటి విజయ ప్రస్థానాన్ని గుర్తుచేశారు. కమిషన్లు, కమిటీల పేరిట ప్రభుత్వం ముప్పేట దాడిచేస్తున్న ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను, తెలంగాణకు ప్రాజెక్టు ఎంత అవసరమో వివరిస్తూ పుస్తకాలను తీసుకొచ్చిన రచయిత శ్రీధర్‌రావును దేశ్‌పాండేను అభినందించారు. తెలంగాణపై ఆయన మమకారం, ప్రేమ.. తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు పారాలన్న తండ్లాటకు ఈ పుస్తకాలే నిదర్శమని కొనియాడారు.
కాళేశ్వరం నిలబడితే, ఆ మంచి పనిని కొనసాగిస్తే కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారనే సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్ష పెంచుకున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రైతుల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి రేవంత్‌రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాగునీటి రంగంలో కేసీఆర్ వందేండ్ల ముందుకు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారని, అందుకు కాళేశ్వరమే నిదర్శమని వివరించారు. నాడు తట్ట మట్టి తీయకుండా రూ.వేల కోట్లను దోచుకున్న కాంగ్రెస్సే నేడు అవినీతి అంటూ మాట్లాడుతున్నదని నిప్పులు చెరిగారు. తన పుట్టినరోజు నాడు కూడా మహారాష్ట్రకు వెళ్లి తెలంగాణ ప్రయోజనాలను, అవసరాలను వివరించి ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ సూచనలు, విశ్రాంత ఇంజినీర్ల నివేదికలు ఇలా అన్నివిధాలుగా ఆలోచించి తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డను మార్చారని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కడితే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేవని మాట్లాడటం అవివేకమని, అక్కడ కూడా ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ ద్వారానే వస్తాయని తెలిపారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆయకట్టు 16 లక్షలు మాత్రమేనని, నీటినిల్వ సామర్థ్యం 16 టీఎంసీలేనని, కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు నీరందనున్నదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 141 టీఎంసీల నీటిని నిలువ చేసే రిజర్వాయర్లను కేసీఆర్ కట్టారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని, వాటిని పుస్తకం ద్వారా శ్రీధర్ దేశ్‌పాండే తిప్పికొట్టారని, వాస్తవాలను బయటపెట్టారని తెలిపారు. కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించేందుకు రేవంత్‌రెడ్డి సరారు టెండర్లను పిలిచిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అజ్ఞానంతో మాట్లాడి విలువ తీసుకోకుండా సోయి తెచ్చుకోవాలని చురకలంటించారు. 2014 జూలైలోనే నాటి కేంద్ర నీటివనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి కృష్ణానదీ జలాల పునఃపంపిణీ జరగాలని కేసీఆర్ పట్టుబట్టారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి, వినకపోతే సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారని, సుదీర్ఘకాలం పోరాడి తుదకు సెక్షన్ 3ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. తెలంగాణకు శాశ్వత పరిషారాన్ని కేసీఆర్ చూపించారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసమే, నీళ్ల చుట్టూనే కొనసాగిందని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో అద్భుతాలను చేశామని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ రాకతో మళ్లీ గతం పునరావృతమవుతున్నదని, చెరువులు ఎండిపోతున్నాయని ధ్వజమెత్తారు. సాగునీటిరంగ నిపుణులు వీ ప్రకాశ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాజకీయ కక్షతో ప్రాజెక్టును పడావు పెడుతున్నదని తెలిపారు. మళ్లీ జలసాధనకు కోసం తెలంగాణ ఉద్యమించాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కార్యక్రమలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, అంబేదర్ వర్సిటీ మాజీ వీసీ కే సీతారామారావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రిటైర్డు ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి టీ వెంకటేశం, సీనియర్ జర్నలిస్టు పీ వేణుగోపాలస్వామి, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.