Peddapalli | పెద్దపల్లి, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూమి కబ్జాపై కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి గోసిక రాజేశం నిరసన తెలిపారు. స్వయంగా రెవెన్యూ మంత్రి, కలెక్టర్‌కు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి అర్ధనగ్నంగా వచ్చి నిరసన తెలుపడం సంచలనం సృష్టించింది. రాజేశం కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలోని సర్వే నంబర్ 492, 510, 506లో పదెకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది భూస్వాములు ఆక్రమించారు. వారి చెరనుంచి భూమికి విముక్తి కల్పించాలని కోరుతూ రాజేశం 28 ఆగస్టు 2024న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి, కబ్జా గురించి వివరించారు. అంతకు ముందే కలెక్టర్ కోయ శ్రీహర్షకు ప్రజావాణిలో విజ్ఞప్తులను అందజేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ పెద్దలు, అధికారుల తీరుకు నిరసనగా కలెక్టరేట్ కార్యాలయానికి అర్ధనగ్నంగా వచ్చి నిరసన తెలుపగా,. అందరూ అవాక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధే ఇలా నిరసనకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తమ మడకలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్కారు ఆధీనంలోకి తీసుకోవాలని, ఆ తర్వాత ఆ భూమిని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం లేదా భూమి లేని నిరుపేదలకు పంచాలని, ఇలా భూ స్వాములకు స్వాధీనం అయ్యే విధంగా చూడవద్దని కోరుతూ అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతి పత్రాన్ని సమర్పించారుడు.
పదేళ్లుగా గ్రామంలోని భూస్వాముల చేతుల్లోనే ఈ భూములు ఉండడం వల్ల గ్రామ అభివృద్ధికి తిలోదకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉండి మంత్రిని కలిసినా, కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతోనే అర్ధనగ్నంగా నిరసన తెలియజేస్తూ వినతి పత్రం సమర్పిస్తున్నానని చెప్పారు.