సిద్దిపేట, నవంబర్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ఆటలాడిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదని హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని జిల్లా గ్రంథాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులు ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్’ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ పాల సాయిరాం మాట్లాడారు.
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? గద్దె దించుమంటారా? అని హెచ్చరించారు. రాహుల్ గాంధీని అశోక్‌నగర్ తీసుకొచ్చింది యువతను రెచ్చ గొట్టే ప్రసంగాలకేనా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ జారీ చేసిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండు లక్షలు దేవుడెరుగు.. 20 వేల ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్న హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో కలిసి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.