హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేసు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగాయని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను దెబ్బతీసేందుకు పాత కేసులతో రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ కుట్రలకు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఈ జూమ్ మీటింగ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు వివరించారు. కాంగ్రెస్ చేసున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో వివరించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టుపై చేస్తున్న కుట్రలను ఎన్నారై గులాబీ శ్రేణులకు స్పష్టంగా వివరించారు.
కాంగ్రెస్‌ది గోబెల్స్ ప్రచారం
ఐదేండ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలేనని కాంగ్రెస్ చెప్తున్నదని, కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు లిఫ్ట్ చేసిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల గురించి ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. 2022-23 వరకు మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది పంప్‌హౌస్ నుంచి 181.7 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్ నుంచి 179.41 టీఎంసీల జలాలను ఎత్తిపోసినట్టు చెప్పారు. సమగ్ర సమచారం తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై గోబెల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక) లేదని కొందరు బురద చల్లే ప్రయత్నం చేశారని, కానీ డీపీఆర్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని అనుమతులను తెచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన ఫలితాలు, ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని వివరించగా బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులు చప్పట్లతో హోరెత్తించారు. హరీశ్‌రావు చెప్పిన వివరాలను శ్రద్ధగా నోట్ చేసుకున్నారు. ప్రజెంటేషన్ అనంతరం తక్కువ సమయంలో వివరాలను సమగ్రంగా తెలియజేసిన హరీశ్‌రావును ఎన్నారై శ్రేణులు ప్రశంసించారు.