హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరసరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఆమెపై క్రిమినల్ కేసు వ్యవహారంలో కోర్టు నోటీసులు ఉన్నాయని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ పేల్చిన బాంబుకు ఏఐసీసీ కకావికలం అవుతున్నట్టు సమాచారం. కుట్రకు మూలం ఎక్కడ? ఈ పని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని ఢిల్లీ కాంగ్రెస్‌లో వార్‌రూమ్ చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అంతర్గత కుట్ర వెనుక కారణాలను అన్వేషించేందుకు ఏఐసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. ఇంటి దొంగే కుట్రదారుడని ఏఐసీసీ బలంగా నమ్ముతున్నట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దలు ఇప్పటివరకు సేకరించిన ఒక్కొక్క ఆధారం ముఖ్యనేత వైపే చూపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గాంధీభవన్ అడ్రస్ మీదే మీనాక్షికి కోర్టు నోటీసులు వచ్చినా, వాటిని గోప్యంగా ఎందుకు ఉంచారు? కేసు వివరాలను దాచిపెట్టడంలో ఉద్దేశం ఏమిటి? నిరుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలంగాణకు రావడం, ఇక్కడి ముఖ్యనేతలను కలువడానికి ప్రత్యేకమైన కారణాలేం ఉన్నాయి? ప్రజాప్రతినిధుల చట్టం
ప్రకారం నామినేషన్ పత్రాల్లో పోలీసు, కోర్టు కేసులు వెల్లడించాల్సి ఉంటుందనే విషయం తెలిసి కూడా, పోలీస్ క్లియరెన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటి? తదితర పూర్తిస్థాయి వివరాలతో నివేదిక రూపొందించి, ఢిల్లీకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్టు తెలిసింది.
అనుమాన బీజం అక్కడి నుంచే
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకోవడానికి సరిపోయేంత ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నది. కానీ ఆ పార్టీ మూడో సీటుకు కూడా అభ్యర్థిని నిలబెట్టింది. దీని వెనుక నెలల తరబడి భారీ కసరత్తు జరిగినట్టు ఏఐసీసీ ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. నవంబర్‌లో మధ్యప్రదేశ్ సీఎం పనిగట్టుకొని తెలంగాణకు రావటం, ఇక్కడి బీజేపీ నేతలను కలువకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యనేతలను మాత్రమే కలువటం, యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ, ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు బాగున్నాయని ప్రశంసించి వెళ్లడం వంటివి అప్పట్లో అతి సాధారణమైన విషయాలని అనుకున్నారు. కానీ మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అనంతరం మధ్యప్రదేశ్ సీఎం తెలంగాణ పర్యటనపై కాంగ్రెస్ పెద్దలు అనుమానిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ముఖ్యనేత మొదటి నుంచి బీజేపీతో సఖ్యతతో ఉంటున్నారనే ఆరోపణలు, ఆయన ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర బీజేపీ మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం తదితర అంశాల మీద ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
ఇంతకీ.. ఏమిటా కేసు?
నారాయణపేట కాంగ్రెస్ నేతపై ఉన్న లైంగిక ఆరోపణల కేసులే మీనాక్షి మెడకు చుట్టుకున్నట్టు తెలిసిం ది. ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డిపై ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆమె కూడా కాంగ్రెస్ నాయకురాలని అంటున్నారు. శివకుమార్‌రెడ్డి మీద 2022 మే 7న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో, 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసులు నమోదయ్యాయి. అతడిని అరెస్టు చేయాలంటూ సదరు మహిళ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ముందస్తు బెయిల్ కోసం శివకుమార్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించింది. ఆయన మేనకోడలికి టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, శివకుమార్‌రెడ్డి ఒకే వేదిక మీద కూర్చున్న వీడియోలు సంపాదించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళ మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్లగా.. శివకుమార్‌రెడ్డిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పినట్టు సమాచారం. ఈ సమాధానంపై సంతృప్తి చెందని సదరు మహిళ.. కోర్టును ఆశ్రయించి, మీనాక్షిని కూడా తన పిటిషన్లో ప్రతివాదిగా చేర్చారు.
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
మీనాక్షి నామినేషన్ తిరసరణ నేపథ్యంలో ఏఐసీసీ బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మాత్రమే ఆహ్వానం అందింది. మరోవైపు రేవంత్‌రెడ్డి సైతం బుధవారం ఢిల్లీ వెళ్లారు. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొంటారని చెప్తున్నారు. అయితే.. మీనాక్షి నటరాజన్‌పై కోర్టు నోటీసుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలు కావాలనే దాచిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి వివరణ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తనమీద బలమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు మీనాక్షిపై జరిగిన కుట్రను ఒక మంత్రి మీదికి మళ్లించేందుకు ముఖ్యనేత ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తన అనుకూల జాతీయ మీడియాలో ‘పెయిడ్’ ప్రచారం చేయిస్తున్నారని తెలుస్తున్నది.
ముఖ్యనేతవైపే అన్ని వేళ్లు
తెలంగాణలో పాలనా వైఫల్యాలను ఢిల్లీ అ ధిష్ఠానానికి తరచూ రిపోర్ట్ పంపిస్తూ, మీనాక్షి తమపై పెత్తనం చెస్తున్నదని ముఖ్యనేత వర్గం మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్నారని, వారే వ్యూహాత్మకంగా కోవర్ట్ ఆపరేషన్ చేసి ఉంటారని పేరు చెప్పటానికి ఇష్టపడని సీనియర్ కాం గ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. కేసు వివరాలను మధ్యప్రదేశ్‌కు పంపించి, మౌనంగా ఉన్నారని చెప్పారు. హిల్ట్ పాలసీ విషయంలో క్యాబినెట్ లో మాట్లాడుతున్న సమాచారం బయటికి పో యిందని ఏకంగా సహచర మంత్రులను అనుమానిస్తూ ఇంటెలిజెన్స్ నివేదిక కోరారని, అ లాంటిది ఏఐసీసీనే కుదిపేస్తున్న ఈ విషయం లో ఎటువంటి విచారణ లేకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని మరో సీనియర్ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నోటీసుల వ్యవహారం లీ కేజీ మీద సమగ్ర వివరాలు సిద్ధం చేసి పెట్టుకున్నట్టు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మరో సీనియర్ కాంగ్రెస్ నేత తెలిపారు. రాష్ట్రం నుంచే కుట్ర జరిగిందని, ఇది ఎంత దా చినా దాగని సత్యం అని, మా అధిష్ఠానానికి ఝలక్ ఇవ్వాలని ఇదంతా చేశారని మరో కాం గ్రెస్ నేత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.