KCR | సింగరేణి పై చాలా పెద్ద కుట్ర జరగబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఇప్పుడు మరోసారి నరేంద్ర మోదీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు దీని గురించి ఆలోచించాలని.. కార్మికుల పక్షాన ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి సింగరేణిని నష్టాల్లోకి పంపించి.. దాన్ని మునగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ ఆస్తి అని.. వంద శాతం మనకే ఉండేదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లోకి పంపించి.. ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని పేర్కొన్నారు. అదే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఎన్నో లాభాలు తెచ్చామని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి.. 19 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చామని.. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( సిమ్స్ )పేరు మీద మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేలా చేసుకున్నామని తెలిపారు. కానీ ఇప్పుడు సింగరేణికి పెద్ద ప్రమాదం రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని నదులను కేంద్రానికి అప్పజెబుతుంటే ఈ ముఖ్యమంత్రి సప్పుడు జేయడని కేసీఆర్ విమర్శించారు. కృష్ణానదిని తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండని అన్నారు. ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీటిని తమిళనాడు, కర్ణాటకకు ఇస్తానని ప్రధాని అంటుంటే.. ఈ ముఖ్యమంత్రి సప్పుడు లేదని మండిపడ్డారు. అదే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రధాని మోదీ ఇదే ప్రతిపాదన తెచ్చిండని తెలిపారు. అయితే.. కేసీఆర్ బతికి ఉండగా గోదావరి నీళ్లు తీసుకెళ్తే ఒప్పుకోనని చెప్పానని పేర్కొన్నారు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్న మతలబు ఏంటనేది ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గోదావరి నది మన బతుకు.. దాన్నే తీసుకెళ్తా అంటే కాంగ్రెస్ గానీ, ముఖ్యమంత్రి గానీ ఎవరూ కూడా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదని మండిపడ్డారు.
‘ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి.. ప్రధానిని బడే భాయ్ అని అంటాడు. గుజరాత్ మోడల్ తెస్తా అంటడు. కానీ ఆ గుజరాత్లో పేదల సంక్షేమం చూడరు.. అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులు, ప్రజలకు మాట్లాడే హక్కులు కూడా లేవు. ‘ అని కేసీఆర్ అన్నారు. ఇక మోదీ చోటే భాయ్.. అదే భారత దేశాన్ని మింగుతున్న అదానీ.. మోదీ అండదండలతో 14 లక్షల కోట్లకు పడగలెత్తిన ఆదానీ.. దేశంలోని అన్ని పబ్లిక్ సెక్టార్ రంగాలను కబలిస్తున్నాడు. టీవీ రంగం కావచ్చు.. కేబుల్స్ కావచ్చు.. ప్రతి రంగాన్ని కబలిస్తున్నాడు. దేశంలో ఉన్న ఓడ రేవులన్నీ కూడా ఆదానీకి అన్యక్రాంతమైపోయాయి. ఎయిర్‌పోర్టులను కూడా ఆదానీకే మోదీ అంకితం చేశాడు.’ అని కేసీఆర్ తెలిపారు.
నేను సీఎంగా ఉన్న రోజుల్లో కరెంటు ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని మోదీ చెప్పాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చిది ఎవరు ఆదానీ.. నరేంద్ర మోదీ తమ్ముడు. మన దగ్గర 4 వేలకు టన్ను దొరికే బొగ్గును.. అక్కడ 28 వేలకు టన్ను కొనమన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. నా ప్రాణం పోయినా సరే ఒప్పుకోనని చెప్పా. నాకు సింగరేణి బొగ్గు ఉండగా.. నీ బొగ్గు ఎందుకు అని చెప్పిన. కానీ ఇవాళ ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆదానీకి గేట్లు తెరిచి వచ్చిండు.. ఆదానీ మీరు తెలంగాణకు రండి.. నాలుగు చేతులతో దోచుకోండి అని సంతకాలు కూడా పెట్టి పిలిచివచ్చిండు. పార్లమెంటు ఎన్నికలు అవ్వడమే ఆలస్యం.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి సింగరేణిని ఊడగొడతరు. ఇది నిజమా కాదా అని ఇంటికి వెళ్లినంక చర్చ జేయండి. ముఖ్యమంత్రి ఆదానీని ఎందుకు పిలిచిండు.. నేనెందుకు రానివ్వలేదు అనేది ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణకు సింగరేణి కొంగుబంగారం. ఒక ఉద్యోగ వనరు. లక్షలాది మంది కార్మికులు, వారిని అనుసరించుకుని అనేక ప్రజలు బతికే ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలి. బయ్యారం ఉక్కుగనులు గానీ, గోదావరి ఇసుక గనులు గానీ సింగరేణికే ఇవ్వాలని నేను సీఎంగా ఉన్నప్పుడు ఆలోచించినా. సింగరేణి డైరెక్టర్‌ను ఆస్ట్రేలియాకు, ఇండోనేసియాకు పంపించిన. ఆదానీ వెళ్లి కోట్లు గడిస్తుండు.. మనం వెళ్లి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు.. సింగరేణి కంపెనీని ఆస్ట్రేలియా, ఇండోనేసియాలో పెట్టమని చెప్పిన. కానీ ఇవాళ ఆదానీ బొగ్గును తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తేడా. రాబోయే రోజుల్లో ఉన్న సింగరేణిని ఊడగొట్టి ఆదానీకి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి.. మన ప్రజల నోట్లో మట్టి. మొత్తం సింగరేణి ప్రాంతాల్లోని ప్రజల బతుకులు బొగ్గు అయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతో ఆలోచించాలి. మీ నిర్ణయం అట్ల తీసుకోవాలి. ఇది చాలా ప్రమాదం. ఇవాళ మీరు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేను. నావల్ల కూడా ఏం కాదు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే.. మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్లాడి.. పీకపట్టుకుని మా సింగరేణిని ఎట్ల ముంచుతవని కొట్లాడతరు.’ అని కేసీఆర్ తెలిపారు. సింగరేణిని కాపాడుకోవాలంటే.. బొగ్గు గని కార్మికుల పక్షాన ఉన్న కొప్పుల ఈశ్వర్ గెలవాలని అన్నారు.