68 ఏండ్ల కిందట ఏర్పడిన కర్ణాటకను.. కేవలం 150 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఖతం చేసేసింది. ఎన్నికల సమయంలో ‘5 గ్యారెంటీ స్కీమ్’లతో అరచేతిలో స్వర్గం చూపించిన ఆ పార్టీ.. ఐదు నెలల్లోనే కన్నడిగులకు నరకమంటే ఏంటో చూపిస్తున్నది. 5 గ్యారెంటీ పథకాలను అమలుచేసేందుకు అప్పటికే ఉన్న పథకాలకు మంగళంపాడిన హస్తం.. కొత్త గ్యారెంటీలనూ అటకెక్కించేసింది. ‘గృహజ్యోతి’ పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పి.. అసలు కరెంటే ఇవ్వకుండా ఎడాపెడా కోతలకు పాల్పడుతున్నది. మహిళలకు నెలకు రూ.2 వేలు ఇవ్వాల్సిన గృహలక్ష్మి పథకాన్ని నిధులు లేక నిలిపేసింది. బియ్యం దొరకటంలేదని రైస్‌కు బదులు డబ్బులు ఇస్తామన్నది. తీరా కిలో బియ్యానికి రూ.9 చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తున్నది. అదీ కొంతమందికే. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఖజానాకు పెనుభారంగా మారడంతో బస్సు సర్వీసులను తగ్గించింది. భారాన్ని తగ్గించుకోడానికి మహిళల వయసు పరిమితిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇచ్చే యువనిధి పథకాన్ని ప్రారంభించనేలేదు. అంతేకాదు.. కరెంటు కోతలు, తాగు, సాగునీటికి కటకట, బెంగళూరులో ట్రాఫిక్, సర్కారులో అంతకంతకూ పెరిగిపోయిన అవినీతి.. వెరసి కాంగ్రెస్‌పాలనలో యావత్తు కర్ణాటకే ‘హస్త’వ్యస్తంగా మారిపోయింది
Congress | హైదరాబాద్, అక్టోబర్ 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): మొగులు జూసి కుండలో నీళ్లు ఒలకబోసుకొన్నట్టు.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో ‘5 గ్యారెంటీ స్కీమ్’లను చూసి కాంగ్రెస్‌ను గెలిపించిన కన్నడిగులకు ఆపార్టీ చుక్కలు చూపిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదని, గృహలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామన్న రూ. 2000ను ఎందుకు ఇవ్వట్లేదని ఏకంగా సీఎం సిద్ధరామయ్యనే పదుల సంఖ్యలో మహిళలు నిలదీశారంటే హామీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏమిటో అర్థంచేసుకోవచ్చు.
ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్తు ఇస్తామన్న కాంగ్రెస్.. విద్యుత్తు కోత లు పెడుతున్నది. ప్రచారం కోసం కొన్ని ఇండ్ల కు ఉచిత కరెంటు అన్న సర్కారు.. ఇప్పుడు అధిక బిల్లులతో వాత పెడుతున్నది. దీంతో ఇలాంటి ‘గృహజ్యోతి’ పథకం వద్దేవద్దంటూ సామాన్యులు లబోదిబోమంటున్నారు.
బియ్యం దొరకటంలేదంటూ స్కీమ్ ప్రారంభంలోనే ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. 10 కిలో ల బియ్యానికి బదులు డబ్బులు ఇస్తామని ప్రకటించి అంతలోనే మెలికపెట్టింది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన బియ్యానికి కిలోకు ఎంత ధర ఉండేదో అంతే ఇస్తామని చెప్పింది. నెలకు ఒక్కో లబ్ధిదారుడికి కిలో బియ్యానికి రూ.9 చొప్పున జమ చేసింది. అదీ పూర్తిగాకాదు.
శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో కర్ణాటక ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. డీజిల్‌కు కూడా డబ్బు లేక అనేక మార్గాల్లో బస్సులను నడపడాన్ని సర్కారు నిలిపేసింది. మహిళలందరికీ ఉచిత ప్రయాణమని చెప్పి ఇప్పుడు వయసులవారీగా మాత్రమే ఫ్రీ అంటూ కొత్త కొర్రీలకు తెరతీసింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటి లో మహిళా పెద్ద బ్యాంకు ఖాతాలో నెలకు రూ.2 వేల చొప్పున జమ చేస్తామన్న కాంగ్రె స్.. ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. కొందరికి.. అదీ ఒక్క నెల మాత్రమే చెల్లించింది. మాటతప్పిన కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన పలువురు మహిళలు సీఎం సిద్ధరామయ్యతోనే వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది.
డిగ్రీ పాసైన యువతకు నెలకు 3 వేలు, డిప్లొమా చేసినవారికి రూ.1500 భృతిగా చెల్లిస్తామన్న పార్టీ, ఆ హామీని పక్కనబెట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు.
కాంగ్రెస్‌పాలనలో కన్నడనాట చీకట్లు అలుముకొంటున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే రోజుకు ఐదారు గంటలపాటు విద్యు త్తు కోతలు విధిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో విద్యుత్తు కోతల సమస్య అంతా ఇంతా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అనధికార కోతలు ఆరేడు గంటలపాటు విధిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్‌లో ఉష్టోగ్రతలు పెరుగడంతో 1,500 మెగావాట్ల నుంచి 2,000 మెగావాట్ల వరకూ లోటువిద్యుత్తు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఒకవైపు విద్యుత్తు కోతలు, మరోవైపు చార్జీల పెంపుతో సామాన్యులతోపాటు పారిశ్రామిక వర్గాలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణలో 24 గంటలపాటు కరెంటు బుగ్గలు వెలుగుతుంటే.. తమ రాష్ట్రంలో 4 గంటలు కూడా గగనమైతున్నదని వాపోతున్నారు. కర్ణాటకలో ఐదు నెలలకే కాంగ్రెస్ ఇంత నిర్వాకం చేస్తే.. పొరపాటున తెలంగాణలో ఓటేస్తే పరిస్థితి ఏమిటని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్‌పాలనలో అన్నదాతలకు కష్టాలు పెరిగిపోయాయి. వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గంటలకొద్దీ ఎడాపెడా విద్యుత్తు కోతలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇది తట్టుకోలేని రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గడిచిన 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొన్న అన్నదాతల సంఖ్య 1,219కి చేరినట్టు గణాంకాలు చెప్తున్నాయి. కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కురుగోడు తాలూకా సింధిగేరి, బైలూరు, కగ్గల్, కల్లుకంభ, ముష్టగట్టి, కోళూరు బాదనహట్టి, వద్దట్టి తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు స్థానిక కురుగోడులోని గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (జెస్కాం)కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కరెంటు కోతలను నిరసిస్తూ.. పావగడ తాలూకాలోనూ రైతు నేతలు స్థానిక జెస్కాం కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహించారు. అయినప్పటికీ, ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవట్లేదు.
‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరును సమస్యలకు కేరాఫ్‌గా కాంగ్రెస్ మార్చేసింది. రోడ్డెక్కితే ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యంతో ఊపిరిపోయే దుస్థితి, విద్యుత్తు కోతలతో సామాన్యుల వెతలు, తాగునీటికి తంటాలు, భద్రత కరువు, ఆకాశాన్నంటుతున్న లివింగ్ కాస్ట్ వెరసి బెంగళూరులో ఇక ఉండబోయేది లేదని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యులు చెప్తున్నారు. నరకానికి చిరునామాగా బెంగళూరు మారిపోయిందంటూ దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ కమెడియన్ ట్రెవోర్ నోహ్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా వంటి ప్రముఖులు సైతం తమ అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టులో మంత్రులు, ఎమ్మెల్యేలకు 40 శాతం కమీషన్ ఇవ్వందే ఏ ఫైలూ కదలటం లేదని ఆ రాష్ర్ట సివిల్ కాంట్రాక్టర్ల సంఘం బాహాటంగానే విమర్శలు గుప్పించింది. వీళ్ల అవినీతి పీడనకు తట్టుకోలేక పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అవినీతి బీజేపీ ప్రభుత్వం పోయిందని సంతోషపడేలోపే ‘అంతకు మించి’ అన్నట్టుగా కాంగ్రెస్హయాంలో మరింత అవినీతి పెరిగిపోయిందని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్ అంబికాపతి ఇంట్లో రూ. 42 కోట్ల అక్రమ సొమ్ము గురువారం బయటపడటం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. తెలంగాణ ఎన్నికల్లో పంచడానికే ఈ అవినీతి సొమ్మును సిద్ధంచేశారని సమాచారం. నాడు ’40 పర్సెంట్’ అవినీతి ప్రకంపనలు సృష్టించగా, నేడు ఏకంగా ‘50’ పర్సెంట్ కాంగ్రెస్ కమీషన్‌రాజ్’ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్‌పైనే ‘50’ పర్సెంట్’ అంటూ ఇటీవల ఆరోపణలు రావటం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాతీరుకు అద్దం పడుతున్నది.